mt_logo

రహీమున్నీసా పౌరుషం, ఆంధ్ర దమననీతిపై ఒక చెప్పుదెబ్బ

By: జే ఆర్ జనుంపల్లి

సిరిసిల్లలో రహీమున్నీసా ప్రదర్శించిన త్యాగము, పౌరుషం, పోరాటపటిమ అత్యంత అరుదైన ఘటన. ఆ సంఘటన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అస్సాం బాలిక కనకలత బారువా ప్రదర్శించిన అనితర సాధ్యమైన స్ఫూర్తిని గుర్తుచేస్తున్నది. ఆ అమ్మాయి అక్కడున్న రెండువేల పోలీసులను, వందలాది సీమాంధ్ర గూండాల నడుమ అద్భుతమైన ధైర్యం,సమయస్ఫూర్తి, నేర్పుతో తనను అదుపులో ఉంచిన పోలీసు వ్యాన్ ను ఎక్కి తన కాలి చెప్పును తీసి ఝులిపించడం ఒక ఊహా జనిత దృశ్యంలా అనిపిస్తుంది. అది నిజంగా జరిగిందంటే కూడా నమ్మలేని అసాధారణ ఘటన. మానవ చరిత్రలో పరపీడన నెదిరించి పోరాడే చావులేని స్వతంత్రేచ్చకు ఒక చక్కటి ఉదాహరణ. సాంప్రదాయ బద్దంగా కొన్ని పరిమితుల్లో ఉండే ముస్లిం సామజిక వర్గం నుండి వచ్చిన ఒక సాధారణ గ్రామీణ యువతి ఇంతటి సాహసాన్ని ప్రదర్శించిందంటే నమ్మశక్యం కాని విషయం. దీనిని బట్టి తెలంగాణ ఉద్యమం వెనుక ఎంతటి ఆవేదన దాగి ఉందో, అక్కడి ప్రజలు ఎంతటి వివక్ష, దుర్మార్గానికి గురి అయినారో, మనం అర్థంచేసుకోవచ్చు.

రహీమున్నీసా చూపించిన చెప్పు కేవలం అక్కడున్న పోలీసు, గూండాలు, విజయమ్మ, సురేఖ వారి అనుచరులపైన మాత్రమే కాదు. గత 60 సం.లలో తెలంగాణపై దాష్టీకము సాగించిన సమస్త వలసవాద వ్యవస్థ మీద. గత దశాబ్దములో తెలంగాణపై చేసిన వాగ్ధానాలు మరిచి మోసం చేసిన పార్టీలు, ప్రభుత్వాల మీద. డిసెంబర్ 9, 2009 తర్వాత తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, యువతీ యువకులపై ‘ఆంధ్ర’, కేంద్ర ప్రభుత్వాల దమననీతి మీద. 854 మంది తెలంగాణ అమరవీరుల బలిదానాలకు కారణమైన వారి మీద. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ తెలంగాణపైకి వస్తున్న చంద్రబాబు, విజయమ్మల లాంటి గూండా రాజకీయ దండయాత్రల మీద. ఆ దండయాత్రలకు, హెలికాప్టర్లతో సహా వేలాది పోలీసులు; కత్తులు,కటార్లు, ఇనుపరాడ్లు, కర్రలతో వస్తున్న గూండాలకు సహాయం చేస్తున్న నేటి నిరంకుశపు రాష్ట్ర ప్రభుతం మీద. అది ఒక సింబాలిక్ చర్య. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హృదయాంతరాల్లో మండుతున్న న్యాయపూరిత ఘృణాత్మకమైన నిరసన. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఇన్నేండ్ల ఆక్రోశం ఒక్కసారిగా ఉప్పెనలా ఉప్పొంగి ఆ అమ్మాయిని అంతటి సాహస కార్యాన్ని చేయడానికి పురిగొల్పింది.

ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ చేసిన రాజకీయ దండయాత్రలో తాండూరులో వీరమణి, తెలుగుదేశం గూండాలపైకి చెప్పు విసిరి తెలంగాణ పౌరుషం చాటి చెప్పింది. రాయనిగుడెంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి , మొగవాళ్ళను ఎదుర్కోలేక కేవలం ఆడవాళ్ళనే అది కూడా చెప్పులు లేకుండా ‘రచ్చబండ’ లో సమావేశపరిచాడు. అయితే రాయనిగూడెం వనితలు, కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థినులు రచ్చబండను రచ్చరచ్చచేసి మన ఘనత వహించిన ముఖ్యమంత్రిని అరగంటలోనే సమావేశం వదిలి హెలికాప్టర్ ఎక్కి పలాయనం చిత్తగించేటట్లు చేశారు.అయినా ఈ ఆంధ్ర వలసవాద దుర్మార్గులకు బుద్ది రాలేదు. నిన్నటికి నిన్న ప్రెసిడెంట్ ఎలెక్షన్ ముందు, ఎలెక్షన్ తర్వాత ఏదో చేస్తున్నామని సిగ్గులేని బొంకులు బొంకి, ఎలెక్షన్ లో వై ఎస్ ఆర్ సి పి తో కుమ్మక్కై, నేడు విజయమ్మకు రాజకీయ దండయాత్ర కు సర్వ లాంచనాలతో బందోబస్తు చేసిన ఈ కాంగ్రెస్ పార్టీని ఎలా వర్ణించాలో పదాలు దొరకడం లేదు. కొన్ని వేల కోట్లు ప్రజల సొమ్మును దోచుకొన్న మరియు తమ ప్రభుత్వమే జైలులో పెట్టిన, తమ కాంగ్రెస్ పార్టీకి పరమ శత్రువు అయిన ఒక క్రిమినల్ రాజకీయ నాయకుడి తెలంగాణ రాజకీయ దండయాత్రకు ప్రధాన మంత్రికి తప్ప ఇతరులకు లభ్యం కానీ హెలికాప్టర్ తో సహా 10000 మంది పోలీసులనుపయోగించి బందోబస్తు చేయడం భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడా జరుగలేదు. ఇదంతా కేవలము ఒక సమైక్యాంధ్ర రాజకీయ పార్టీ తెలంగాణలో యాత్ర చేయగలిగింది అని నిరూపించడానికి మాత్రమే అని తెలుసు కొంటే, ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ ముఖ్యమంత్రి ఎంతటి అథఃపాతాళానికి దిగజారిపోయారో, ఈ ఆంధ్రులంతా కలిసి తెలంగాణ ప్రజలను ఇంకా ఎంతటి అవమానాలకు గురిచేయాలని సిద్ధపడుతున్నారో తెలుస్తుంది.

ఒకవైపు ఆంధ్ర దుర్మార్గం ఇలా కొనసాగుతుంటే, 80 మందికి పైబడి ఉన్న మన తెలంగాణ ఎం ఎల్ ఎ లు, ఒక్కడూ ఒక్క మాట మాట్లాడటం లేదు.సిరిసిల్లకు పోయే దారిలో ఉన్న నియోజక వర్గాల ఎం ఎల్ ఎ లు కే.లక్ష్మారెడ్డి, నర్సిరెడ్డి కూడా తెలంగాణ పై జరుగుతున్న ఈ ఆంధ్రుల దౌర్జన్యానికి సిగ్గులేకుండా సహకరించారు. వీళ్ళంతా ఆంధ్ర రాజకీయ వర్గాలకు రాజకీయ అధికారం కొరకు అవినీతి డబ్బుకొరకు తమ ఆత్మలను అమ్ముకొని బానిస బతుకులు బతుకుతున్నారు. ఇక మన కాంగ్రెస్ ఎంపిలైతే సమయాన్ని బట్టి ఆకుకు అందకుండా పోకకు చెందకుండా వంకర టింకర మాటలు మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నారు. వాళ్ళకు వాళ్ళ ఆధిదేవత సోనియాగాంధీ దర్శనమే అతి దుర్లభం. వీళ్ళకు సోనియాగాంధీ, అహమద్ పటేల్, ఆజాద్ లను ఎదిరించి, ప్రజల ఆకాంక్షలను వారి ఉద్యమ గతి విధులను ఆసరా చేసుకొని తమ రాజకీయ లీవరేజ్ ని ఉపయోగించి పనులు చేయించే దన్ను కానీ, ధైర్యం కానీ లేవు.ఎప్పుడూ, తెలంగాణలో ఈనాటి దుస్థితికి కారణమైన కిరణ్ కుమార్ రెడ్డిని, వాళ్ళ అధినేత కనుసన్నలలో రిమోట్ కంట్రోల్ తో నడిపిస్తున్న ఆజాద్ తో తమ అరకొర మొరలు మొర పెట్టుకొంటుంటారు. మన ఎం పి లకు ముఖ్యమంత్రి ముందు పిసరంత కూడా విలువలేదు. రాష్ట్రంలో ఏ మంచి పనీ చెయ్యడం చేతకాని ముఖ్యమంత్రి వీళ్ళ మాటల్ని ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తుంటాడు. అవసరమైతే వీళ్ళు అడిగినదానికి అడ్డంగా పనిచేస్తుంటాడు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఆపడం అయన ప్రధాన మాండేటు మరియు ఎజెండా. ఇక పోతే ఆ దేశముదురు ఆజాద్, వీళ్ళను ముప్పై కుంటల నీళ్ళు తాగించి ముప్పు తిప్పలు పెడుతుంటాడు. అక్కడ చెల్లక ఇక్కడికి వచ్చి అరిగి పోయిన గ్రామఫోను రికార్డుల్లాగా అర్థం లేని, అమలు కాని హామీలు, ఊహాగానాలు వల్లె వేస్తుంటారు. ఎక్కడో దూరంగా సందు దొరికినప్పుడు ఉత్తర కుమార ప్రజ్ఞలు పలుకుతుంటారు. మళ్ళీ కేంద్రానికి వెళ్ళినపుడు, అధిష్టానం అడక్కముందే అందరికంటే ముందు వాళ్ళ పనులు చేసిపెడుతుంటారు. ఎప్పుడూ అధిష్టానం తెలంగాణ విషయంలో చేస్తున్న నిరంతర వాయిదా ప్రక్రియకు అలసిపోకుండా యధాలాపంగా సహాయపడుతుంటారు.

ఇంతమంది మన ప్రజా ప్రతినిధులు ఉండి, ఆంధ్ర ప్రభుత్వము వారి యంత్రాంగము తెలంగాణ ప్రజల మీద చేస్తున్న దౌర్జన్య దమనకాండను ఎదిరించే రాజకీయ శక్తిలేని నిర్వీర్యులై అఘోరిస్తున్నారు. ఈ మలిదశ ఉద్యమంలో, రాష్ట్ర సాధన కొరకు ఉద్యమం,ఎలెక్షన్లు రెంటినీ ఉపయోగించాలనే విధానంలో తెలంగాణ ప్రజలు ఇటు ఉద్యమంలో గాని, అటు ఎలెక్షన్లలో గాని తమ వంతు కర్తవ్యాన్ని ఎంతో ఉదాత్తంగా నిర్వర్తించారు. ఈ పనికి మాలిన ప్రతినిధులు రహీమున్నీసా చూపిన తెగువ, ధైర్యం,సాహసం లో పదో వంతు ప్రదర్శించినా ఈ పాటికి మనం మన తెలంగాణ రాష్ట్రంలో ఉండేవాళ్ళము.

దేశంలోని మరియు రాష్ట్రంలోని సభ్యసమాజం, మీడియా కూడా తెలంగాణ ప్రజల మీద ఆంధ్ర, కేంద్ర ప్రభుత్వాల దమన నీతిని సరిగ్గా గమనించడం లేదు, గమనించినా క్రియాశీలకంగా ప్రతిస్పందించడం లేదు. దేశంలోని ప్రజాస్వామ్యంలో నియంతృత్వ ధోరణులకు తెలంగాణపై ఆంధ్ర ప్రభుత్వం జరుపుతున్ననిరంకుశ ఆధిపత్య ధోరణి ఒక ప్రమాదకర సంకేతమని వీరు గుర్తించాల్సిన అవసరముంది.

రహీమున్నిసా తన ప్రాణాల్ని పణంగా పెట్టి ఆంధ్ర ప్రభుత్వ దౌర్జన్యాన్ని ఎదుర్కొన్న వీరోచిత సంఘటనను చూసైనా మన ప్రజా ప్రతినిధులు భాద్యతాయుతంగా ప్రవర్తించి తెలంగాణ రాష్ట్రం అతి త్వరలో సాధించే ప్రక్రియలో పాల్గొంటారని ఆశిద్దాం. ఆ సంఘటనలో తీవ్రంగా గాయపడిన రహీమున్నీసా మరియు లలిత త్వరలో కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి తెలంగాణ సాధనలో పాల్గొనాలని భగవంతుని ప్రార్థిద్దాము. ఆమెతో పాటు అసంఖ్యాకంగా సిరిసిల్ల ప్రతిఘటనలో పాల్గొన్న తెలంగాణ ప్రజలకు మన ఉద్యమ అభినందనలు తెలియజేద్దాము.

రహీమున్నిసా వీరోచిత గాధ మన తెలంగాణ రాష్ట్ర పోరాట చరిత్రలో ఒక ధ్రువతారలా వెలుగొందుతుంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *