– రుద్రవరం రామప్ప
రాధాకృష్ణ బుకాయింపులకు, అబద్ధాలకు అంతులేదు. ఆయనలో ఆత్మవంచన, పరవంచన పీక్‌కు చేరింది. పిచ్చి ముదిరింది. ఆయన ప్రజలకు సెల్యూట్ చేస్తాడట. ప్రజలెన్నుకున్న నాయకుడికి మాత్రం కాదట. ప్రజలు అంగీకరించిన రాజకీయాలకు కాదట. కేసీఆర్ కూడా సెల్యూట్ చేయమన్నది తెలంగాణ ప్రజలకే. తెలంగాణ ప్రజలకు సెల్యూట్ చేస్తే తనకు చేసినట్టేనన్నారు. తనను తిట్టినా పర్వాలేదు. తెలంగాణ ప్రజలను అవమానించవద్దని కేసీఆర్ అన్నారు. రాధాకృష్ణ మట్టి బుర్రకు అది అర్థం కాలేదు. రాధాకృష్ణకు ప్రజలపైన, ప్రజల తీర్పుపైన ఎప్పుడూ గౌరవం లేదు. ఆంధ్ర ఉప ఎన్నికల్లో జగన్‌ను గెలిపిస్తే ప్రజలు అమ్ముడుపోయారని, రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలనీ కామెంట్ చేసిన ఘనాపాఠి రాధాకృష్ణ. ఆయనకు ఎవరిపైనా గౌరవం ఉండదు, చివరికి చంద్రబాబునాయుడుపైన కూడా. ఆయనకు ఆయనే ఒక ఏసు ప్రభువు, ఒక గౌతమబుద్ధుడు, ఒక వాసుదేవుడు. ఒకటే ప్రశ్న తెలంగాణ ప్రజలంటే గౌరవం ఉన్నవాడికి ఆ ప్రజలు ఎన్నుకున్న నాయకుడిపైన కూడా గౌరవం ఉండాలి కదా? ఆ నాయకుడిని టార్గెట్ చేయడం అంటే తెలంగాణ ప్రజలను టార్గెట్ చేయడమే కదా? ప్రజలకు ఏమీ తెలియకుండానే, పిచ్చోళ్లయి కేసీఆర్‌ను ఎన్నుకున్నారని రాధాకృష్ణ భావిస్తున్నారా? ఇప్పుడు ఏమి జరిగిందని కేసీఆర్ నియంత అయ్యాడు? ఏమి చేశారని ఫాసిస్టు అయ్యాడు? తెలంగాణ ప్రజాప్రతినిధులపై పిచ్చికూతలు కూస్తున్న రాధాకృష్ణ రంగు డబ్బాను, మరో టీవీని అభిశంసిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి స్పందించి తెలంగాణ ఎమ్మెస్వోలు ఆ డబ్బాలను డిస్‌కనెక్టు చేశారు. ఇందులో కేసీఆర్‌ను ఫాసిస్టుగా నిందించవలసిన అవసరం ఏముంది?
చంద్రబాబు ప్రజాస్వామ్యం-మహావంచన
పూర్వపాలకులు, అంటే చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాడని అందుకే కేసీఆర్, తెలంగాణవాదులు బతికిపోయారని రాధాకృష్ణ డబ్బాకొట్టాడు. చంద్రబాబు వెన్నుపోటుకు రాధాకృష్ణ దన్నుపాటు ఇవ్వబటికే ఆరోజు మహానుభావుడు ఎన్‌టిఆర్ ఆగమయిపోయాడు. అర్ధంతరంగా అధికారంపోయి, అవమానం భరించలేక, గుండెపగిలి చనిపోయాడు. వీరిరువురి ప్రజాస్వామ్యం గురించి తెలుగు ప్రజలందరికీ తెలుసు. ‘పొక్కలు వెతికే(కీ హోల్) జర్నలిజం’ తప్ప రాజకీయ అవగాహన, పరిణతి ఎంతమాత్రం లేని రాధాకృష్ణకు చంద్రబాబులో గొప్ప ప్రజాస్వామిక వాదే కనిపించారు. తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధించింది ఎవరో చెప్మా? తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా అనేకానేక కుట్రలు చేసింది ఎవరో చెప్పుకోండి? 2004 ఎన్నికలకు ముందు టీఆరెస్ నుంచి గెలిచిన జడ్‌పీటీసీలను, ఎంపీటీసీలను కొనుగోలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఆగంపట్టించింది ఎవరో చెప్పుకోండి చూద్దాం? రాధాకృష్ణా నీకు అంత మెమరీ పవర్ లేకపోవచ్చు… కానీ పాత పేపర్లు తిరగేసే ప్రయత్నం చంద్రబాబు ప్రజాస్వామ్యం రంగు తేలిపోద్ది. విద్యుత్ ఉద్యమకారులపై తూటాలు పేల్చిన ప్రజాస్వామ్య వాది ఎవరో చెప్పుకోండి చూద్దాం? తెలంగాణ ఉద్యమ వార్తలు కవర్ చేస్తున్నందుకే కదా చంద్రబాబు ‘వార్త’ దినపత్రికకు ప్రకటనలు ఆపేసింది. లక్ష్మీపార్వతికి అనుకూలంగా వార్తలు రాసినందుకే కదా వార్తపై చంద్రబాబు కక్షగట్టింది. తమరి జ్ఞాపకశక్తి వేపకాయంత కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలు గుర్తు పెట్టుకుంటారు.
అక్కసుకు, వంవచనకు పరాకాష్ఠ
రాధాకృష్ణకు ఇప్పుడు వైఎస్సార్ దేవుడులాగా కనిపిస్తున్నాడట. కేసీఆర్ ఇప్పుడు దయ్యంలాగా కనిపిస్తున్నాడు. రేపు కేసీఆర్ కంటే ఘటికుడు ఎవరన్నా వచ్చి ఆంధ్రజ్యోతి తాట తీస్తే అప్పుడు కేసీఆర్ ఉత్తముడయిపోతాడన్నమాట(సరే అలాగే). జగన్, కేసీఆర్ అపూర్వసహోదరులట. అందుకే కేసీఆర్ జగన్‌ను ఏమీ అనడం లేదట. రాధాకృష్ణ పైత్యానికి పట్టపగ్గాల్లేవనడానికి ఇది మంచి ఉదాహరణ. రాధాకృష్ణ అబద్ధాలకు ఇంతకన్నా క్లాసికల్ ఉదాహరణ మరోటి దొరకదు. జగన్ అనే ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం కేసీఆర్‌కు ఏముంది? ఆయన ఇక్కడ ఎప్పుడో దుకాణం బందుపెట్టుకున్నాడు. తెలంగాణ రాజకీయాల్లో ఆయన కాలూవేలూ పెట్టడం మానుకున్నాడు. తెలంగాణకు జగన్‌కు రాజకీయ సంబంధమే తెగిపోయింది. మాకేమి తీట ఆయన గురించి మాట్లాడుకోవడానికి. అది మీరు మీరూ తేల్చుకోండి. అపూర్వ సహోదరులు అనే అబద్ధాన్ని మాపై ఎందుకు రుద్దుతావు రాధాకృష్ణ. జగన్‌కు నీకు పంచాయితీ ఉంటే నువ్వూ జగన్ చూసుకోండి. కానీ కేసీఆర్‌ను ఎందుకు లాగుతావు రాధాకృష్ణా? నీకు దురద ఉంటే జగన్‌తో రుద్దుకో తేల్చుకో…కేసీఆర్‌కు ఏం పని?
తెలంగాణ ఉద్యమం నడిపించినట్టు బిల్డప్
తెలంగాణ ఉద్యమాన్ని ఈయనే నడిపించినట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు. ఈయన పత్రిక ప్రారంభించింది 2002 ఆగస్టులో. టీఆరెస్ పుట్టింది 2001 మార్చిలో. ఎవరు ముందు? ఎవరు వెనుక? అరె ఓ బుజ్దిల్…. కొంచెం సోయి తెచ్చుకుని ఆలోచించు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలు కళ్లు తెరవకముందే వార్త పత్రిక 2001 మార్చి నుంచే స్పెషల్ పేజీలు ప్రారంభించి తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు పోసింది. వార్త ఒక దశలో ఈనాడును సవాలు చేసింది. వరంగల్లులో నంబర్ వన్ పత్రికగా పేరు తెచ్చుకుంది. వార్త ప్రభంజనాన్ని తట్టుకునేందుకు ఈనాడు కూడా వార్తలు పెంచింది. అదే రుతువులో జన్మించిన ఆంధ్రజ్యోతి కేవలం వ్యాపార హృదయంతో తెలంగాణకు స్పేస్ ఇచ్చింది. తాను స్వయంగా పత్రిక నడిపిస్తే జనం పట్టించుకోరని తెలిసీ, తనకు పేస్ అవసరమయి రామచంద్రమూర్తిని, కే.శ్రీనివాస్‌ను, వి.మురళిని, అల్లం నారాయణను, ఇంకా అనేక మందిని ముందుపెట్టి పత్రిక ప్రారంభించావు(నాలుగేళ్ల తర్వాత అవసరం తీరగానే ఓడ మల్లన్న అన్నావు, అంతా నేనే అని చెలరేగిపోయావు). తెలంగాణ ప్రజలకు చేరువ కావడానికి, వార్తను, ఈనాడును దెబ్బకొట్టడానికి ఇంతకంటే మంచి మార్గం లేదని కేవలం ఒక వ్యాపారిగా మాత్రమే రాధాకృష్ణ ఆనాడు తెలంగాణ వార్తలను, వ్యాసాలను అనుమతించాడు. అంతకు మించిన గొప్ప ఔదార్యం ఆయనకు ఎప్పుడూ లేదు. కానీ ఆయన తెలంగాణ ఉద్యమంపై ఎప్పుడూ ఏదో విధంగా దాడి చేస్తూనే వచ్చాడు. రాధాకృష్ణ వంకర రాతలు రాసినప్పుడల్లా కేసీఆర్ విమర్శిస్తూనే వచ్చాడు. మీవి ‘న్యూస్ పేపర్లా వ్యూస్ పేపర్లా’ అని కేసీఆర్ ఆనాడే ప్రశ్నించాడు. మీవి ‘కులపత్రికలు, గులపత్రికలు’ అని కేసీఆర్ అప్పుడే గుర్తించారు. మీరు తెలంగాణకు అనుకూలంగా ఏదయినా చేశారూ అంటే అది కేవలం మీ అవసరం రాధాకృష్ణా. అదేమీ మెహర్బానీ కాదు.
ఎంత పెద్ద అబద్ధం రాధాకృష్ణా?
శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఆంధ్రజ్యోతి ఒక్కటే తెలంగాణకు అనుకూలంగా ఉందని, దానిని మేనేజ్ చేస్తే సరిపోతుందని రాసిందా? అవ్వ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు… ఎన్నో అబద్ధాలను ఆలవోకగా కుమ్మరించినవారికి ఇదొక లెక్కా… గోబెల్ వారి బాస్ హిట్లర్ కూడా మూర్చపోతారు రాధాకృష్ణ తెలివితేటలు చూస్తే. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పేర్కొంది ఒక్క ఆంధ్రజ్యోతి సంపాదకుడు మాత్రమే తెలంగాణకు చెందినవారని రాసింది. పత్రికలన్నీ సీమాంధ్ర యజామాన్యాల పెత్తనంలోనే ఉన్నాయని రాసింది. వారిని మేనేజ్ చేస్తే సరిపోతుందని రాసింది. దానిని వక్రీకరించి, ఆ వ్యాఖ్యను తన పత్రికకు అన్వయించుకుని ఇంత పెద్ద అబద్ధం ప్రచారంలో పెట్టారు రాధాకృష్ణ! తెలంగాణవాదులను పత్రికలో రాసుకోవడానికి అనుమతించినట్టు, అదేదో ఘనకార్యం అయినట్టు బిల్డప్ ఇస్తున్నావు. కానీ అది నీ అవసరం రాధాకృష్ణా. కే.శ్రీనివాస్‌ను ఎడిటర్‌గా కొనసాగించడం నీ గొప్పతనం కాదు. కే.శ్రీనివాస్‌కు తెలంగాణ ప్రజల్లో ఉన్న గుర్తింపు కారణం. కే.శ్రీనివాస్ పత్రిక నుంచి బయటపడితే నీ ముఖం ఎవరూ చూడరని తెలిసీ, చైతన్యంతో ఆయనను కొనసాగిస్తున్నావు. నీకు తెలంగాణపై ప్రేమతో కాదు. తెలంగాణ ఉద్యమంపై గౌరవంతో కాదు. తప్పనిసరయి. కే.శ్రీనివాస్ తెలంగాణపై రాయడం నీ పత్రికతో మొదలు కాలేదు. వార్తలో, ప్రజాతంత్రలో కొత్త వంతెన శీర్షికతో ఆయన అప్పటికే వీర తెలంగాణ వాదిగా ఎన్నో వ్యాసాలు రాసిన విషయం తెలిసీ, నీకు కవచం అవసరం అయ్యీ ఆయనను తెచ్చుకున్నావు. ఇప్పుడేమో తమరేదో ఆశ్రయం ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నావు.
నీది ఆధిపత్య దురహంకారం
తెలంగాణ రాష్ట్ర అవతరణను, టీఆరెస్ విజయాన్ని జీర్ణించుకోలేని కుతర్కం నీది. సీమాంధ్ర ఆధిపత్య దురహంకారానికి మిగిలిన ఆఖరి అవశేషం నువ్వు. సీమాంధ్ర ఏజెంటువు కాబట్టే నీకు ఇక్కడి రాజకీయాలు రుచించడం లేదు. కుటుంబం కుటుంబం అని రాస్తున్నావే, చంద్రబాబు సకుటుంబ సపరివార సమేతంగా రాజకీయాలు చేస్తున్నా ఒక్క రోజు కూడా రాయలేదెందుకని. జాతీయ మీడియా, అంతర్జాతీయ మీడియా అని ఒర్లుతున్నావు, వాళ్లేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా… ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మార్కండేయ కట్జూ నీ పత్రిక గురించి చెప్పారో మాకు తెలువదనుకున్నావా? ఆంధ్రజ్యోతి పత్రికా విలువల ఉల్లంఘనలో హాబిట్యువల్ అఫెండర్‌గా మారినట్టు కనిపిస్తున్నదని చీవాట్లు పెట్టలేదా? ఎంతమందిని ఎన్ని రకాలుగా వేధిస్తున్నావో ప్రెస్ కౌన్సిల్ విచారణలో బట్టబయలు కాలేదా? నీకు మా కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం జీర్ణం కావడం లేదు. ఆయన చకచకా పనులు చేసుకుపోవడం నచ్చడం లేదు. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు జాతీయ మీడియాలో నీలాంటి వాళ్లే ఒకరిద్దరు దొరికారు. అర్నబ్ గోస్వామి ఢిల్లీ రాధాకృష్ణ. బాధ్యత లేకుండా, సమాధానాలు వినకుండా, ఏక పక్షంగా భౌభౌమని అరవడం ఒక్కటే మీకు తెలుసు. అవేవీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇంచు కూడా కదిలించలేవు.
