రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎంతో విలువైన ఎర్రచందనం చెట్లను పెంచనున్నట్లు, ఇందుకు అవసరమైన నేలలను గుర్తించేందుకు భూసార పరీక్షలను నిర్వహిస్తామని అటవీ శాఖామంత్రి జోగు రామన్న తెలిపారు. రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం పథకం అమలుపై తగిన సూచనలు, సలహాలివ్వడానికి దక్షిణ కొరియా నుండి నిపుణుల బృందం త్వరలో హైదరాబాద్ రానున్నదని ఆయన వివరించారు. పెన్ చాంగ్ లో జరిగిన 12 వ అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులో పాల్గొని నగరానికి వచ్చిన జోగురామన్న ఆదివారం మీడియాతో మాట్లాడారు.
కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంచడం ద్వారా అటవీ విస్తీర్ణం పెంపొందించేందుకు రూపొందించిన హరితహారం పథకాన్ని సదస్సులో పాల్గొన్న పలువురు ప్రతినిధులు ప్రశంసించారని చెప్పారు. దక్షిణ కొరియాలో 1945 తో పోలిస్తే ప్రస్తుతం అటవీ విస్తీర్ణం 85 శాతం పెరిగిందని, సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో రాష్ట్రంలో చేపట్టిన హరితహారం కూడా సత్ఫలితాలనిస్తుందని జోగురామన్న పేర్కొన్నారు.