ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చితీరుతామని, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాత పార్టీ అని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మెదక్ జిల్లా సిద్ధిపేట మండలంలోని తోర్నాలలో మొక్కజొన్న పరిశోధన కేంద్రానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీష్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ, తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, రైతులు కష్టాలపాలు కాకుండా వారికి ప్రయోజనం కలిగించే దిశగా ప్రభుత్వం ముందుకు పోతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు పాత రుణాలు మాత్రమే మాఫీ చేశారని, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పాత, కొత్త రుణాలతో పాటు బంగారంపై తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేస్తుందని చెప్పారు. 20వేల కోట్ల పంట రుణాలు త్వరలో మాఫీ కానున్నాయని, ఇజ్రాయెల్ తరహాలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.
నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, సీమాంధ్ర ప్రభుత్వ పాలన మూలంగా తెలంగాణలో కరెంట్ కష్టాలు నెలకొన్నాయని, ఉమ్మడి రాష్ట్రంలో వడగండ్ల వర్షంతో రైతులు నష్టపోతే నాలుగేళ్ల నుండి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే జిల్లాకు పరిహారం కింద 6కోట్ల రూపాయలు విడుదల చేసిందని గుర్తుచేశారు. సీడ్ టెక్నాలజీ పాలిటెక్నిక్ కళాశాల లేదా ఫుడ్, సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలను త్వరలో మంత్రి పోచారం సహకారంతో ఏర్పాటు చేయబోతున్నామని హరీష్ రావు పేర్కొన్నారు.