రాజ్యసభలో ఎన్డీయే కన్నా అధిక మెజారిటీ కాంగ్రెస్ కే ఉందని, పోలవరం బిల్లును కాంగ్రెస్ నేతలే అడ్డుకోవాలని, దీనిద్వారా వారి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేస్తూ బీజేపీ తన మందబలంతో లోక్ సభలో ఆమోదింపజేసినా రాజ్యసభలో బిల్లును అడ్డుకోవాలని తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన డిమాండ్ చేశారు.
పోలవరం బిల్లును వ్యతిరేకిస్తూ అన్యాయం, నిరంకుశత్వం అని స్టేట్మెంట్లు ఇచ్చిన జానారెడ్డి, జైపాల్ రెడ్డి, డీఎస్, పొన్నాల తమ చిత్తశుద్ధిని చేతల్లో చూపాలని, ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీ ఇంటిముందు కూర్చొని ఒప్పించాలని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజలవైపు ఉంటారో లేక ఆంధ్రా కాంగ్రెస్ నేతలకు దాసోహమవుతారో తేల్చుకోవాలని పేర్కొన్నారు. పోలవరం బిల్లుతో బీజేపీకి తెలంగాణ ప్రజలపై ఉన్న వ్యతిరేకత బయటపడిందని, ముంపు మండలాల ప్రజలతో పాటు భద్రాద్రి రాముడు కూడా రాజ్యసభవైపు చూస్తున్నాడన్నారు.
రాజ్యసభలో టీఆర్ఎస్ తరపున కే కేశవరావు ఒక్కరే అయినా తెలంగాణ ప్రజల గొంతుకను ఎలుగెత్తి చాటుతారని, ఓటింగ్‌కు పట్టుబట్టి అందరి రంగును బయటపెడతామని చెప్పారు. తెలంగాణ టీడీపీ నుండి ముగ్గురు ఎంపీలు ఉన్నారని, వారు తెలంగాణ ప్రజలవైపు ఉంటారో? లేక బాబు తొత్తులుగా ఉంటారో తేల్చుకోవాలని, సభలో కలిసివచ్చి బిల్లును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ నేతలు బడ్జెట్ లో పైసా రాకపోయినా నోరు మెదపలేదని, ఇప్పుడు పోలవరం బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని మాత్రం తప్పుపడుతున్నారని మండిపడ్డారు.
ఆంధ్ర నాయకులు వారి ప్రయోజనాల కోసం ఎలా కలిసి పనిచేస్తున్నారో మన ప్రాంత నాయకులు కూడా అలాగే కలిసిరావాలని, టీఆర్ఎస్ పోరాటానికి మద్దతు తెలపాలని కేటీఆర్ కోరారు. పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, ప్రాజెక్టు డిజైన్ మార్చమని డిమాండ్ చేస్తున్నామని సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారని, ఆంధ్ర ప్రాంత ఇంజినీర్లు కూడా ముంపు తగ్గేవిధంగా సూచనలు చేశారని, గిరిజనులను ముంచుతూ మూడో పంటకు నీరిస్తామంటున్నారని విమర్శించారు. గతంలోకూడా ఇదే విషయంపై న్యాయపోరాటం చేశామని, ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.