చారిత్రాత్మక ప్రాంతమైన రాచకొండకు త్వరలో మహర్దశ పట్టనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సినిమా, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ సిటీలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చెప్పారు. సోమవారం రాచకొండ గుట్టలు, పరిసర ప్రాంతాలను ఏరియల్ సర్వే చేసిన అనంతరం సీఎం మాట్లాడుతూ, సుమారు 32 వేల ఎకరాల మేర విస్తరించిన ఈ ప్రాంతంలో అధిక భాగం చాలా చదునుగా, వివిధ సిటీల ఏర్పాటుకు అనుకూలంగా ఉందని, కొత్తగా నిర్మించబోయే నగరాల కారణంగా ఎలాంటి కాలుష్యం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, తెలంగాణకే తలమానికంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. నల్గొండ జిల్లా ఇప్పటికే ఫ్లోరైడ్ రక్కసి కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నదని, కొత్తగా జిల్లాకు మరో సమస్య తెచ్చిపెట్టే ఉద్దేశం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు.
సుమారు మూడుగంటలపాటు ఈ ప్రాంతంలో తిరిగిన సీఎం కేసీఆర్ భూములకు సంబంధించి పూర్తి వివరాలను రంగారెడ్డి, నల్గొండ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏఏ సర్వే నంబర్లలో ఎంతమేరకు భూములున్నాయి? ఎలాంటి భూములున్నాయనే విషయాలను స్పష్టంగా చెప్పాలని, నెలాఖరుకల్లా సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాచకొండ ప్రాంతం నల్లగొండ జిల్లా పరిధిలోకి 16 వేల ఎకరాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలోకి 14 వేల ఎకరాల వరకు వస్తుందని అధికారులు సీఎంకు చెప్పారు.
రాచకొండలో ఏర్పాటు చేయబోయే నగరాలన్నీ హైదరాబాద్ కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం, ఔటర్ రింగ్ రోడ్ నుండి అతి దగ్గరలో ఉన్నందున ఇక్కడ అభివృద్ధి చేపడితే రవాణాకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్ నుండి రాచకొండను అనుసంధానం చేస్తూ కొత్త హబ్ లకు నాలుగువైపులా ఫోర్ వే రోడ్లను నిర్మించాలని కూడా సర్కార్ ఆలోచన. ఏరియల్ సర్వేలో సీఎం కేసీఆర్ తో పాటు భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మంత్రులు మహేందర్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గాదరి కిషోర్, పైళ్ళ శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రెండు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.