బడ్జెట్ సమావేశాలపై చర్చ జరుగుతుండగా అనుకోకుండా పీవీ వైపు చర్చ మళ్ళింది. సానుభూతి కోసం ప్రభుత్వం పీవీపై ప్రేమ చూపించిందని అన్న జానారెడ్డి వ్యాఖ్యలపై మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్ళు విజయవంతంగా నడిపిన మేధావి పీవీ చనిపోతే ఆయన మృతదేహాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తీసుకుపోకుండా నేరుగా హైదరాబాద్ పంపించి ఘోరంగా అవమానించారని, మిగతా ప్రధానుల మాదిరిగా ఆయన అంత్యక్రియలు డిల్లీలో చేయకుండా హైదరాబాద్ లో చేశారని, శవం కూడా పూర్తిగా కాలనివ్వకుండా అతిభయంకరంగా అవమానించారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ బిడ్డకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దితే సానుభూతి కోసం చేశారని అంటారా? అని, ఆ మహానుభావుడి జయంతి కానీ, వర్ధంతి కానీ అధికారికంగా నిర్వహించుకోలేని దౌర్భాగ్యం మీది కాదా? అని జానారెడ్డిపై కేటీఆర్ ధ్వజమెత్తారు. జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి సమర్ధులైనవారు దొరకకే గతిలేని సమయంలో పీవీని ప్రధానిని చేశారని, ఆయనను వాడుకుని వదిలేశారన్నారు.