మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 94వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల్లో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీష్ రావు, తుమ్మల నాగేశ్వర రావు, మహేందర్ రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, కాంగ్రెస్ ఎంపీ వీహెచ్ హనుమంతరావు, పలువురు కాంగ్రెస్ నేతలు, పీవీ కుటుంబ సభ్యులు పాల్గొని దివంగత ప్రధాని పీవీకి నివాళులు అర్పించారు.
హోం మంత్రి నాయిని మాట్లాడుతూ మైనార్టీ ప్రభుత్వాన్ని చాకచక్యంగా ఐదేళ్ళు నడిపిన గొప్ప రాజకీయ చాణక్యుడు పీవీ నరసింహారావు అని అన్నారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పీవీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, తెలంగాణ ఆణిముత్యమైన పీవీని గౌరవిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ఢిల్లీలో పీవీ స్మారక భవనం నిర్మించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని భువనగిరి ఎంపీ డాక్టర్ బూరనర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.
12 ఏళ్లుగా ఏనాడూ ఒక్క సమావేశం కూడా జరగని జ్ఞానభూమి వద్ద గత సంవత్సరం టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మొదటి సమావేశం నిర్వహించారని, పీవీ తెలంగాణ బిడ్డ అని ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ గుర్తు చేశారని పీవీ కుమారుడు పీవీ రాజేశ్వరరావు అన్నారు. పీవీ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.