మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 93వ జయంతి సందర్భంగా గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంజీవయ్య పార్కు వద్ద ఉన్న పీవీ ఘాట్ కు చేరుకొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, స్వర్గీయ పీవీకి త్వరలోనే భారతరత్న ఇవ్వాలని కాబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని, ఆయనకు ఎన్ని భారతరత్నలు ఇచ్చినా తక్కువేనని ప్రశంసించారు.
పీవీ తాను నమ్మినదాన్ని ఆచరణలో చేసి చూపించారని, ఆయన రచనలు, సాహిత్యంలో గొప్ప అనుబంధం ఉందన్నారు. పీవీ మరణం తనను ఎంతో కలచివేసిందని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. భూ సంస్కరణల చట్టాన్ని మొదటగా అమలులోకి తీసుకొచ్చారని,17 భాషల్లో ప్రవేశం ఉన్న పీవీకి ఎన్ని అవార్డులు ఇచ్చినా ఆయన వ్యక్తిత్వానికి తక్కువేనన్నారు. పీవీ ఆదర్శాలు నిరంతరం ఉండాలని, త్వరలో పీవీ పేరిట భవన్ నిర్మిస్తామని, అందులో పీవీ జ్ఞాపకాలు పొందుపరుస్తామని చెప్పారు.
త్వరలో మంచి ప్రదేశంలో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, కొత్తగా ఏర్పడబోయే జిల్లాకు, ఒక యూనివర్సిటీకి పీవీ పేరు పెడతామని హామీ ఇచ్చారు. ఇది ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో పీవీ జయంతిని మరింత ఘనంగా నిర్వహిస్తామని, పీవీ విగ్రహం పెట్టాలనే ఆలోచన గత ప్రభుత్వానికి రాకపోవడం విచారకరమని కేసీఆర్ పేర్కొన్నారు.
పీవీ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ కు గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, దేశ ప్రజలకు పీవీ ఎంతో సేవ చేశారని, దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టిన వ్యక్తి అని, సెనేట్ లో పీవీ చేసిన ప్రసంగం అనిర్వచనీయమని గుర్తుచేసుకున్నారు.