-బతుకమ్మ సంబురాలకు శ్రీకారం చుట్టిన భువనగిరి
-చారిత్రక పట్టణంలో అనూహ్య స్పందన
-వేలాదిగా తరలివచ్చిన మహిళలు
-ఉద్యమానికి ఊపునిచ్చిన బతుకమ్మ: ఎంపీ కవిత
-జిల్లాకే తొలి సంబురాల అవకాశం దక్కడం అదృష్టం: మంత్రి జగదీశ్‌రెడ్డి
నల్లగొండ జిల్లా భువనగిరి ఖిలా సాక్షిగా స్వరాష్ట్రంలో తొలి బతుకమ్మ ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంబురాలకు శ్రీకారం చుట్టారు. జూనియర్ కళాశాల మైదానం వేదికగా జరిగిన ఈ సంబురంలో మహిళలు వేల సంఖ్యలో తరలివచ్చారు.
పూల పండుగతో నేల పులకించిపోయింది.తెలంగాణ రాష్ట్రంలో తొలి బతుకమ్మ సంబరాలు భువనగిరి నుంచి అధికారికంగా ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాలకు తెలంగాణ జాగృతి సంస్థ మరింత ఊపు తీసుకొచ్చింది. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంట్లో మధ్యాహ్నం తొలి బతుకమ్మను పేర్చారు. తర్వాత ఎలిమినేటి కృష్ణారెడ్డి, నాగారం అంజయ్య, కొలుపుల అమరేందర్ ఇళ్లల్లోనూ రంగు రంగుల పూలతో బతుకమ్మలు తీర్చి దిద్దారు. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు పాడారు.
సాయంత్రం హనుమాన్ వాడ నుంచి మొదలైన ర్యాలీ సంబురాల వేదిక జూనియర్ కళాశాలకు చేరుకుంది. తెలంగాణా సంస్కృతి ప్రతిబింబించేలా అధికారులు ఏర్పాటు చేసిన కళారూపాలు ర్యాలీ పొడవునా ఆటలాడారు. కొమ్ము నృత్యాలు, డప్పు వాయిద్యం, డోలు, సన్నాయి, గంగిరెద్దుల ఆటలు, కోలాటాలు, యక్షగానాల వేషధారణలు, జడకొప్పుల భజనలతో భువనగిరి హోరెత్తింది. పట్టణం నలు మూలల నుంచి కాలేజీ గ్రౌండ్‌కు వెల్లువలా చేరుకున్న వేలాది మహిళలు, తమ బతుకమ్మల అక్కడ ఉంచి ఉయ్యాల పాటలతో లయబద్దంగా కదులుతూ ఉత్సాహ పరిచారు. మహిళలతో పదం కలిపి, పాటల్లో గొంతు కలిపి కవిత వారిని ఉత్సాహ పరిచారు. సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ ఆటపాటలతో ఆ ప్రాంతం మార్మోగింది. తర్వాత పెద్ద చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
నేడు కొత్తగూడెంలో బంగారు బతుకమ్మ
తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో తొలిసారిగా జరుగుతున్న బతుకమ్మ ఉత్సవాలకు సింగరేణి స్టేడియం గ్రౌండ్ ముస్తాబైంది. బతుకమ్మ ఉత్సవాల ప్రారంభం తరువాత రెండో రోజు గురువారం తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కొత్తగూడెం నియోజక వర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణాన్ని గులాబీమయం చేశారు.
సింగరేణి స్టేడియం గ్రౌండ్ బతుకమ్మల కోసం అన్ని హంగులతో మహిళలకు స్వాగతం పలుకుతూ ముస్తాబును సంతరింపజేసుకుంది. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు, ఎంపీ కవితకు స్వాగతం పలుకుతూ ఎమ్మెల్యే జలగం ఏర్పాటు చేసిన బెలూన్‌లు స్టేడియం గ్రౌండ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఉద్యమంలో ఉత్సాహాన్ని నింపింది బతుకమ్మే
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను 2008 నుంచి ప్రారంభించుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ మాటల్లో చెప్పలేనంత ఉత్సాహాన్ని నింపింది. నేడు బంగారు బతుకమ్మ సంబురాలను జరుపుకుంటున్నాం. రేపటి రోజు బంగారు తెలంగాణను కేసీఆర్ నాయకత్వాన చూడబోతున్నాం. సమైక్య పాలనలో మన బతుకమ్మ ఎన్నో అవహేళనలకు గురైంది. ఆ కసితోనే నేడు ఇంత దృఢంగా జరుపుకుంటున్నాం. అధికారికంగా నిర్వహించుకునే స్థాయికి చేరుకున్నం. అనుక్షణం బతుకమ్మ సంబురాలకు అండగా నిలిచిన మహిళా సమాజానికి అండగా ఉంటాం. బతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన నేటి భోనగిరిని నా జీవితంలో మరిచిపోను. – -కల్వకుంట్ల కవిత
తొలి సంబురాలు మన అదృష్టం
స్వరాష్ట్రంలో తొలి బతుకమ్మ సంబురాలు మన జిల్లా నుంచి ప్రారంభించుకునే అవకాశం దక్కడం మన అదృష్టం. తరతరాల దోపిడీ కారణంగానే నాడెన్నడూ ఇంత ఘనంగా జరుపుకోలేక పోయాం. నేడు బతుకమ్మ జరుగుతున్న తీరు చూస్తుంటే స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న ఫీలింగ్ కలుగుతోంది. ఇది వరకు చేసుకున్న ఉత్సవాలకు వీటికి చాలా తేడా ఉంది. తెలంగాణ రాష్ట్రం నేడు, రేపు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే కేసీఆర్ లక్ష్యం. దసరాకు చాలా ప్రాధాన్యం ఉంది గనుకే అన్ని పనులకూ దసరా నుంచి శ్రీకారం చుడతానని కేసీఆర్ చెబుతున్నరు. మన నాయకుడు కలగంటున్న బంగారు తెలంగాణకు శక్తి యుక్తులన్నీ కలగలిపి ప్రయత్నిస్తున్నరు. అసమానతలు లేని, ఆకలికేకలు లేని, సుఖ సంతోషాలతో కూడిన రాష్ర్టాన్ని చూడడమే టీఆర్‌ఎస్ ధ్యేయం.
– మంత్రి జగదీశ్ రెడ్డి