mt_logo

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

By: వనం జ్వాలా నరసింహారావు [CPRO to Telangana CM]

బృహస్పతి సింహరాశిలో ప్రవేశించడంతో ఈ సంవత్సరం జులై 14 న ప్రారంభ కానున్న గోదావరి పుష్కరాలను తెలంగాణలో అంగరంగ వైభోగంగా, నభూతో అన్న రీతిలో జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సకల సన్నాహాలు చేస్తోంది. బృహస్పతి ప్రతి సంవత్సరం ఏదో ఒక రాశిలో వుంటాడు. పుష్కరుడు, బృహస్పతి కలిసి వుండే స్థితిలో వచ్చేవే పుష్కరాలు. సింహరాశిలో వున్నప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. అలానే, వివిధ రాశుల్లో వున్నప్పుడు గంగ, రేవా, సరస్వతి, యమున, కృష్ణ, కావేరి, భీమరథి, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, సింధు, ప్రణీతా నదులకు పుష్కరాలొస్తాయి. పుష్కారాలొచ్చిన నదిలో 33 కోట్ల దేవతలు వచ్చి స్నానం చేస్తారని పురాణాలు చెపుతున్నాయి. ఈ ఏడాది గోదావరి కొచ్చిన పుష్కరాల్లాంటివి 144 ఏళ్లకోసారి వస్తాయి.

దక్షిణ భారతదేశంలోని నదులన్నింటిలో కల్లా పెద్దదైన గోదావరి నది, గంగా నదికంటే కూడా ప్రాచీనమైనదని పురాణోక్తి. గోదావరినే దక్షిణ గంగ అని కూడా అంటారు. గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావరి మహారాష్ట్రలోని నాసికా త్ర్యంబకంలో ఆవిర్భవించి, ఆ రాష్ట్రంలో 136 కిలోమీటర్లు ప్రయాణించి, నిజామాబాద్ జిల్లా కందకుర్తి దగ్గర తెలంగాణలో ప్రవేశిస్తుంది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలలోని బాసర, ధర్మపురి, కాళేశ్వరం, ఏటూరునాగారం, భద్రాచలం ప్రదేశాల మీదుగా 480 కిలోమీటర్లు ప్రవహించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల గుండా పారి అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుంది.

పుష్కరాలనేవి ప్రధానంగా ఆచారవ్యవహారాలతో కూడుకున్న ఓ పవిత్రమైన కార్యక్రమం. పుష్కరుడు పన్నెండేళ్లకోసారి నదులను ఆవహిస్తాడని, పుష్కర సందర్భంగా నదీ స్నానం చేస్తే పుణ్యం కలుగుతుందనే నమ్మకం ఆబాలగోపాలానికి వుంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, నమ్మకాల నేపధ్యంలో, పుష్కర స్నానం చేసినవారికి ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి. పుష్కర సందర్భంగా పితృ తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, నిర్వహిస్తే పుణ్య లోకాల్లో వున్న పెద్దలు సంతృప్తి చెందుతారు. అందుకే పవిత్ర నదీ స్నానం చేసేందుకు లక్షలాది మంది ఆసక్తి కనబరుస్తారు. అలాంటి పుష్కరాలను తెలంగాణలోని గోదావరి నది ప్రవహించే ప్రదేశాలలో ఘనంగా, అద్భుతంగా నిర్వహించాలనేది ప్రభుత్వ సంకల్పం. దీన్ని ప్రభుత్వ కార్యక్రమం లాగా కాకుండా, ప్రభుత్వ బాధ్యతలాగా నిర్వహించ తలపెట్టింది ప్రభుత్వం. భక్తులందరికీ సౌకర్యాలు కలిగించే బాధ్యత, శాంతి భద్రతలు కాపాడే భాద్యత, ఇబ్బందులు తలఎత్తకుండా చూసే భాద్యత ప్రభుత్వానిదే.

2003 లో గోదావరికి పుష్కరాలు వచ్చిన సందర్భంగా, అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం, త్వరలో రానున్న ఎన్నికలను దృష్టిలో వుంచుకుని, ప్రచార ఆర్భాటంతో వ్యవహరించింది. దానికి భిన్నంగా, ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం, నదీ స్నానం చేయడానికి వచ్చే అవకాశమున్న లక్షలాది మంది యాత్రీకులకు వసతులు కలిగించే విషయం మీద అధిక శ్రద్ధ కనబరిచింది. దీనికి తోడు, దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పీఠాధిపతులను ఆహ్వానించడమైంది. ధార్మిక-ఆధ్యాత్మిక-సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి, హైదరాబాద్‌తో సహా ఇతర ప్రదేశాలనుంచి గోదావరి నదీ స్నానానికి వెళ్లదల్చుకున్న వారికి అన్ని రకాల రవాణా సౌకర్యం కలిగించడానికి, పుష్కర స్నానం చేసినవారికి సమీపంలోని దేవాలయాల్లో భగవత్ దర్శనం చేసుకోవడానికి ఆయా దేవాలయాలకవసరమైన మరమ్మత్తులు చేపట్టడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అదే విధంగా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌ల నుంచి పుష్కర స్నానాలకు రాదల్చుకునే యాత్రికులకు కూడా సౌకర్యాలు కలిగించనుంది ప్రభుత్వం. ముంబాయి, భివాండి, షోలాపూర్, సూరత్ లాంటి ప్రదేశాలలో వున్న తెలంగాణ ప్రజలు కూడా పుష్కరాలలో పాల్గొనేలా గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అవగాహనా ప్రచారం జరిగింది. ఉత్తర భారతదేశంలో కూడా తెలంగాణ గోదావరి పుష్కరాల గురించి విరివిగా ప్రచారం జరిగింది. విశ్వవ్యాప్తంగా వున్న తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులు ఈ సందర్భంగా రాష్ట్రానికి వచ్చి పుణ్య స్నానాలు చేసే అవకాశం వుంది. నదికి వెళ్లే రహదారుల, స్నాన ఘట్టాల నిర్మాణం దాదాపు పూర్తైందని అధికారులంటున్నారు. రద్దీ ఎక్కువగా వుండవచ్చని భావిస్తున్న బాసర, ధర్మపురి, కాళేశ్వరం, కందకుర్తి, భద్రాచలం ప్రాంతాలలో అదనపు ఏర్పాట్లు జరిగాయి. మహిళల కొరకు ప్రత్యేక సదుపాయాలు జరిగాయి. యాత్రీకుల రద్దీని క్రమబద్ధీకరించే ఏర్పాట్లు కూడా జరిగాయి. వైద్య శిబిరాల ఏర్పాట్లకు కూడా చర్యలు చేపట్టింది ప్రభుత్వం.

ఈ అవసరాలన్నీ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు, ఏడాది క్రితమే, గోదావరి పుష్కర ఏర్పాట్లకు శ్రీకారం చుట్టడం జరిగింది. నెల-నెలా అధికారులతో, సంబంధిత మంత్రులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి. దరిమిలా, రాష్ట్రవ్యాప్తంగా, ఐదు జిల్లాలలో వున్న బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం పుణ్య క్షేత్రాలున్న ప్రాంతంలోని గోదావరి నదిలోను, కందకుర్తి, పోచంపాడు, మంచిర్యాల, గూడెం, రామన్న గూడెం, పర్ణశాల సమీపంలోని గోదావరి నదిలోను, లక్షలాది మంది స్నానం చేసే అవకాశం వున్నందున ఆ ప్రాంతాలలో మొత్తం 106 స్నాన ఘట్టాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ అన్ని ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నాయి. ఉత్కృష్టంగా, వేదోక్తంగా, సాంప్రదాయ బద్ధంగా యజ్ఞయాగాదుల నిర్వహణ, విశేష పూజలు, పితృ తర్పణాలు, నూతన వధూవరుల పుణ్య స్నానాలు, ఇతర పుణ్య కార్యాలు జరుపుకునేందుకు వీలుగా ఏర్పాట్లు జరిగాయి.
ధార్మిక దృష్టితో ఆలోచన చేసిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు, పుష్కర సందర్భంగా అవలంబించాల్సిన పద్ధతులను, అనుసరించాల్సిన విధానాలను, పరిపూర్ణంగా అవగాహన చేసుకోవడానికి, వివిధ పీఠాధిపతుల సలహాలు-సూచనలు తీసుకోమని ఆదేశాలిచ్చారు. దానికి అనుగుణంగా ప్రభుత్వ సలహాదారుడు శ్రీ కె వి. రమణాచారి, ముఖ్యమంత్రి గురువు శ్రీ మృత్యుంజయ శర్మ, శ్రీ యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి, 90 ఏళ్ల వయసున్న శ్రీ పాలకుర్తి నృసింహ సిద్ధాంతి, తదితరులు ఒక బృందంగా పీఠాధిపతుల సందర్శనార్థం వెళ్ళి వారిని పుష్కరాలకు ఆహ్వానించి వచ్చారు. వీరు సందర్శించి, ఆహ్వానించిన పీఠాధిపతుల్లో, శృంగేరి, కంచి, పుష్పగిరి, మంత్రాలయం, కుర్తాళం, విజయదుర్గా పీఠాధిపతి మొదలైన వారున్నారు. వీరు కాక, స్వరూపానంద స్వామిని, గురుమదనానంద స్వామిని, చినజీయర్ స్వామిని, ధర్మపురి సచ్చిదానంద స్వామిని కూడా కలిసి ఆహ్వానించారు. వీరంతా సూత్రప్రాయంగా పుష్కరాలలో పాల్గొనడానికి అంగీకరించారు. చినజీయర్ స్వామి భద్రాచలం పుష్కర ప్రారంభ సమయంలో అక్కడికి వెళ్తానన్నారు. తర్వాత, మంచిర్యాలలో ఐదు రోజులు వుంటామన్నారు. ఆ సందర్భంగా వారున్న చోట, యజ్ఞయాగాదుల నిర్వహణ, అనుగ్రహ భాషణ చేస్తామన్నారు. బాసరలో గురు మదనా నంద సరస్వతీ స్వామి పుష్కర ప్రారంభ సమయంలో వుండి, తర్వాత పన్నెండు రోజులు తెలంగాణలోని వివిధ పుణ్య క్షేత్రాలలో పర్యటిస్తామన్నారు. పుష్పగిరి, మంత్రాలయం, ఇతర పీఠాధిపతులు ధర్మపురి, కాళేశ్వరం, బాసర, ఇతర పుణ్య క్షేత్రాలకు వెళ్తామన్నారు.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *