తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సాగునీటి అధికారులు, కృష్ణా జిల్లా సీఈ, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, నీటిపారుదల రంగ సలహాదారు విద్యాసాగర్ రావు తదితరులతో భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు ఆదివారం పులిచింతల ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, పులిచింతల ప్రాజెక్టులో 20 టీఎంసీల నీళ్ళు నిల్వ చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం కోరుతుందని, అయితే ఈ ప్రాజెక్టు వల్ల నల్లగొండ జిల్లాలో 13 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని, వారికి నష్టపరిహారం చెల్లించి, పునరావాసం కల్పించిన తర్వాతే నీటిని నిల్వ చేసుకునేందుకు అంగీకరిస్తామని స్పష్టం చేశారు. పునరావాసం కోసం రూ. 130 కోట్లు అవసరమని, ముందుగా రూ. 40 కోట్లు ఇస్తే ఐదు గ్రామాల ప్రజలతో మాట్లాడి వారికి కావాల్సిన వసతులు కల్పించి ఖాళీ చేయిస్తామని చెప్పారు.
ఈ విషయంపై ఏపీ మంత్రి ఉమా మహేశ్వరరావుతో మాట్లాడామని, రూ. 40 కోట్లు ఇచ్చేందుకు ఆయన అంగీకరించారని, ఆ డబ్బు అందిన తర్వాత పునరావాసం, నష్టపరిహారం చెల్లించి అప్పుడే నీటినిల్వకు ఒప్పుకుంటామని హరీష్ చెప్పారు. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ప్రజా కార్యక్రమంగా చేపడతామని, నీటిపారుదల శాఖ ఉద్యోగులకు ల్యాప్ టాప్ లు, లేటెస్ట్ పరికరాలు అందిస్తామని తెలిపారు.
బీజేపీ నాయకులు కరెంట్ సమస్యపై అంబేద్కర్ విగ్రహానికి మెమొరాండం ఇవ్వడం చాలా సంతోషకరమని, అయితే బీజేపీ నేతలు రాష్ట్ర ప్రయోజనాన్ని కోరుకుంటే ముందు ప్రధాని మోడీకి దరఖాస్తు ఇవ్వాలని సూచించారు. కరెంట్ అడిగితే చంద్రబాబు ఇవ్వడం లేదని, కేంద్రం పట్టించుకోవట్లేదని, దీన్ని బీజేపీ నేతలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు తప్పకుండా పెడదామని, తెలంగాణకు కరెంట్ ఇవ్వకుండా చంద్రబాబు చేస్తున్న కుట్రలపై కూడా చర్చిద్దామని హరీష్ రావు పేర్కొన్నారు.