mt_logo

సొమ్మొకడిది- సోకొకడిది: ప్రొ. కోదండరాం

మంగళవారం టీజీవో కేంద్ర సంఘ కార్యాలయంలో జరిగిన ఆర్టీసీ తెలంగాణ అధికారులు, సూపర్‌వైజర్ల సారధ్యంలో జరిగిన రౌండ్ సమావేశంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీరు సొమ్మొకడిది, సోకొకడిది అన్నట్లుగా ఉందని అన్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు రేయింబవళ్ళు కష్టపడి పనిచేసి తెలంగాణలో లాభాలు తెస్తుంటే సీమాంధ్ర ప్రాంతంలో కొత్త బస్సులు నడుపుతూ ఆర్టీసీకి నష్టాలు తెస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో నిజాంల కాలంలోనే 1932 లో 27 బస్సులు, 166 మంది కార్మికులతో రోడ్డు రవాణా సంస్థ ప్రారంభమయ్యిందని, హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం రాష్ట్ర రైల్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్ మెంట్ ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. అప్పటి ఆర్టీసీ ఆస్తులను ప్రస్తుతం లెక్కించబోయే ఆస్తుల లెక్కలలోకి తీసుకోరాదని ఆయన సూచించారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఆర్టీసీలో ఉద్యోగాలను, ఆస్తులను కాపాడుకోవడానికి ఎంతకైనా పోరాడుతామని అన్నారు. తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఆర్టీసీ కార్మికులు చేసిన పోరాటం చాలా గొప్పదని ప్రశంసించారు. లాభాలు ఇక్కడ తెస్తే సీమాంధ్రులు అక్కడ అనుభవించారని, తెలంగాణలో ఆర్టీసీ అభివృద్ధికి సీమాంధ్ర పాలకులు ఏమీ చేయలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీ విఠల్, ఆర్టీసీ టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్ధామరెడ్డి, అధ్యక్షుడు తిరుపతయ్య, ఎంప్లాయీస్ యూనియన్ నేత బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *