ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం నిజాయితీతో అమలుచేయాల్సిందే అని, వ్యవసాయానికి అతిముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయడానికే అధిక ప్రాధాన్యం ఇస్తామని టీఆర్ఎస్ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్ లో రిటైర్డ్ తెలంగాణ ఇంజినీర్స్ ఫోరం నాయకులతో కేసీఆర్ ఐదు గంటలపాటు సమావేశమయ్యారు.
నవతెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని, కృష్ణా–గోదావరి బేసిన్ లో 70–80శాతం పూర్తైన ప్రాజెక్టులను వినియోగంలోకి తేవడానికి కృషి చేస్తామని అన్నట్లు సమాచారం. నీటిపారుదల ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఏఏ దశల్లో ఉన్నాయో వెళ్లి చూసొద్దామని, హెలికాప్టర్ లో వెళ్లి పైనుంచే ప్రాజెక్టుల తీరుతెన్నులను చూడడానికి మీరుకూడా నాతో రండి అని వారితో అన్నట్లు తెలిసింది.
మైనర్ ఇరిగేషన్ ద్వారా తెలంగాణలో గతంలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని, ప్రస్తుతం మూడు లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నదని నిపుణులు కేసీఆర్ కు వివరించారు. తెలంగాణలో 26 ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయని, వీటిని పూర్తిచేసేందుకు 18వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలని, నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ను అంతం చేయడానికి డిండి ప్రాజెక్టును మూడునాలుగు సంవత్సరాలలో ప్రారంభిస్తామని, అందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని నీటిపారుదల శాఖ నిపుణులకు సూచించారని సమాచారం.
సమావేశం అనంతరం సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ సభ్యుడు ఆర్ విద్యాసాగర్ రావు విలేకరులతో మాట్లాడారు. వచ్చే రెండుమూడేళ్ళలో తెలంగాణలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలనే ముఖ్య ఉద్దేశంలో కేసీఆర్ ఉన్నారని, తన 34 సంవత్సరాల వృత్తి జీవితంలో ఎంతోమంది ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను చూశానని, కానీ కేసీఆర్ ఈరోజు ఇచ్చిన సూచనలు, సాగునీటిరంగంపై ఆయన చూపిస్తున్న ఆసక్తి, ఉత్సాహం వేరే ఎవ్వరిదగ్గర చూడలేదని చెప్పారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు, ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే హరీష్ రావు, నాయిని నర్సింహారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ లు రమణాచారి, ఏకే గోయల్, రిటైర్డ్ డీజీపీ పేర్వారం రాములు తదితరులు పాల్గొన్నారు.