తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీమాంధ్ర ముఖ్యమంత్రుల వద్ద ఊడిగం చేస్తూ సొంత పనులు చేయించుకున్నారని, కాంట్రాక్టులు, కమిషన్లు తీసుకున్నారు తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు రెండూ ఏనాడూ రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని, భారీ నీటిపారుదల శాఖామంత్రిగా పనిచేసిన పొన్నాల ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తిచేశాడా? అని ప్రశ్నించారు. ధర్నాలు చేస్తున్న టీ కాంగ్రెస్ నేతలను రైతులే నిలదీస్తున్నారని అన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబుకు హుదూద్ తుఫాను బాధితులకు సాయమందించడం కూడా చేతకాలేదని, తుఫాను బారిన పడ్డ ప్రజలు ఇప్పటికీ చీకట్లోనే మగ్గుతున్నారని, కనీస సాయంకోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మొండి వైఖరిపై తెలంగాణ టీడీపీ నేతలు ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. అమరవీరుల గురించి కాంగ్రెస్, టీడీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని, అమరుల కుటుంబాలను ఆదుకుంటామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారని, తెలంగాణ ప్రజల ఎజెండానే టీఆర్ఎస్ ఎజెండా అని బాల్క సుమన్ స్పష్టం చేశారు.