మేడిన్ తెలంగాణ/హైదరాబాద్ అని కనిపించేలా ప్రతి వస్తువు ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆకాంక్షకు అనుగుణంగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర కృషి చేస్తున్నారు. పారిశ్రామిక వర్గాల నుండి సిఫార్సులు స్వీకరించడంతో పాటు కావాల్సిన విధివిధానాల రూపకల్పనలో ఆయన తలమునకలయ్యారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం రూపొందించడంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ బిజీగా మారింది. వారంలోపే పాలసీ అమల్లోకి తెచ్చేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.
దేశవిదేశాల నుండి పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ సంవత్సరం ఆఖరికల్లా సదస్సును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. 160దేశాల ప్రతినిధులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. సింగపూర్, గుజరాత్ తరహా పారిశ్రామిక విధానంపై అధికారులు ఇప్పటికే అధ్యయనం చేశారు. తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం డ్రాఫ్టును పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కే ప్రదీప్ చంద్ర గురువారం సీఎం కేసీఆర్ కు అందజేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించగా సీఎం సంతృప్తి వ్యక్తం చేస్తూ కొన్ని సవరణలు ప్రతిపాదించారని సమాచారం.