రాజకీయ నాయకులు ఎన్ని ప్రలోభాలు చూపినా ప్రజలు టీఆర్ఎస్ వైపే నిలిచారని, సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే అని టీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. సోమవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన సందర్భంగా తెలంగాణ భవన్ లో ఈటెల మాట్లాడుతూ, మున్సిపల్ ఫలితాలు తాము ఊహించినవేనని, గతంతో పోల్చితే మెరుగైన ఫలితాలు సాధించామని, ఈ సందర్భంగా ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసి సంబరాలు చేసుకుంటున్న పొన్నాలకు పరిషత్, సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రజలు కర్రకాల్చి వాతలు పెడతారని, 2009 ఎన్నికలప్పుడే పొన్నాల ఓడిపోయాడని, ఆయనను చూసి జనగాం ప్రజలు ఓట్లు వేయలేదని పేర్కొన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీకి ఎవరూ ప్రచారం చేయలేదని, కేసీఆర్ కూడా స్థానిక ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్ నేతల ప్రలోభాలనుంచి తమవారిని రక్షించుకోవాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీకి ఉందని, క్యాంపులు నిర్వహించాల్సిన ఖర్మ తమకు లేదని ఈటెల స్పష్టం చేశారు. తెలంగాణలోని ఎక్కువ మున్సిపాలిటీల్లో హంగ్ ఉందని, వీటిలో అధిక చైర్మన్ పదవులను తామే గెలుస్తామని, మున్సిపల్ ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్నా, పరిషత్, సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమని రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.