టీఆర్ఎస్ కు 75కు పైగా అసెంబ్లీ స్థానాలు దక్కుతాయని, తెలంగాణలో వచ్చేది మన ప్రభుత్వమే అని టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయనను కలిసేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మాజీ ఎంపీ జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, మల్కాజిగిరి లోక్ సభ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్సీ మహమూద్ అలీ, ధర్మపురి నియోజకవర్గ నేతలు తదితరులు కేసీఆర్ ను కలిసినవారిలో ఉన్నారు.
మరోవైపు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్ల జేఏసీ నేతలు, డీఎస్సీ 2012 అభ్యర్థులు ఆయనను కలిసి వారికి జరిగిన నష్టాలను కేసీఆర్ తో చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, ఆప్షన్లకు ఒప్పుకునే ప్రసక్తే లేదని, రాబోయే తెలంగాణలో ప్రధాన సమస్య విద్యుత్ అని, ప్లాంట్ల నిర్మాణం చేపట్టి రెండుమూడేళ్ళలో మిగులు విద్యుత్ సాధించాలని ఉద్యోగులకు సూచించారు. డీఎస్సీ 2012 మొదటి జాబితాలో ఎంపికై రెండవ జాబితాలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి న్యాయం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.