అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేలా అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేస్తుందని గవర్నర్ నరసింహన్ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 66వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్న సీఎం కేసీఆర్ మొదట అమరవీరులకు నివాళి అర్పించారు.
పరేడ్ మైదానంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, బంగారు తెలంగాణ సాధించుకునేందుకు ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నదని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విజిలెన్స్, భద్రత తదితర అంశాల్లో వినియోగించుకుంటూ పాలనను మరింత పటిష్టం చేస్తున్నదని చెప్పారు. 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం సంతోషకరమని, అవినీతిలేని తెలంగాణే లక్ష్యమని, ప్రభుత్వంలో అవినీతిని సహించేది లేదని పేర్కొన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు భేష్ అని, ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్ధంగా విధులు నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు.
హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే దిశగా శాంతిభద్రతలకు పెద్దపీట వేస్తూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నట్లు గవర్నర్ చెప్పారు. ప్రతిక్షణం నిఘా ఉండేలా సీసీటీవీ వ్యవస్థను ఏర్పాటుచేయడం ద్వారా అత్యంత భద్రత ఉన్న నగరంగా ప్రపంచంలోని ఇతర నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుందని అన్నారు. ప్రతి శాఖలో గ్రీవెన్స్ సెల్, షీ ట్యాక్సీ, షీ టీమ్స్ లను ఏర్పాటు చేశారని, విద్యుత్ కొరత ఎదుర్కునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, 20 వేల మెగావాట్ల విద్యుత్ ను రాబోయే మూడేళ్ళలో ఉత్పత్తి చేసేందుకు వేగంగా చర్యలు తీసుకుందని గవర్నర్ పేర్కొన్నారు.