mt_logo

ప్రభాకర్ రెడ్డిని 6 లక్షల మెజారిటీతో గెలిపించాలి – టీ రాజయ్య

గత ఎన్నికల్లో మెదక్ ఎంపీగా సీఎం కేసీఆర్ ను 4 లక్షలకు పైగా మెజారిటీతో గెలిపించారని, త్వరలో జరగబోయే మెదక్ లోక్ సభ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని ఆరు లక్షల మెజార్టీతో గెలిపించాలని ఉపముఖ్యమంత్రి టీ రాజయ్య పిలుపునిచ్చారు. గురువారం సంగారెడ్డిలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సమావేశాన్ని స్థానిక మంజీరా బాలాజీ గార్డెన్స్ లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి రాజయ్య, మంత్రులు మహేందర్ రెడ్డి, హరీష్ రావు తోపాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఉప ముఖ్యమంత్రి రాజయ్య మాట్లాడుతూ, మెదక్ పార్లమెంటు స్థానానికి జరిగే ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలు టీఆర్ఎస్ కు పోటీ కాదని, పరువు నిలబెట్టుకోవడానికే ఆ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో ఉంచాయని, గత సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కీలుబొమ్మలుగా వ్యవహరించిన మాజీ మంత్రి సునీతా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిలకు పోటీ చేసే అర్హత లేదని మండిపడ్డారు. మాటపై నిలబడే వ్యక్తిని చూసి ఓట్లేయాలని, పదవుల్లో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరొకలా ప్రవర్తిస్తున్న వారికి ఓట్లేస్తే బూడిదలో పోసిన పన్నీరేనని రాజయ్య అన్నారు.

ఈ ఎన్నికలు తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ వాదులకు మధ్య జరుగుతున్నాయని, ఎన్నికల్లో పోటీకి నిలబడాలంటేనే భయపడేలా తెలంగాణ ద్రోహులను ఓడించాలని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. సమైక్యవాదుల చేతుల్లో కీలుబొమ్మలుగా వ్యవహరించిన కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి, బీజేపీ నేత జగ్గారెడ్డిలు ఏమొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు చర్యలు చేపట్టి కేసీఆర్ మాటల మనిషి కాదని చేతల మనిషి అని నిరూపించుకుని ప్రజలకు దేవుడయ్యారని హరీష్ రావు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *