తెలంగాణకు విద్యుత్ రాకుండా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన కుటిల యత్నాలు బెడిసికొట్టాయి. పీపీఏ రద్దుచేయాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ ఒప్పందాల నుంచి వైదొలగుతున్నట్లు ఈఆర్సీకి ఆంధ్రా ప్రభుత్వం లేఖ రాయడాన్ని కేంద్రం తప్పుపడుతూ ఒప్పందం రద్దుచేయడం కుదరదని, తెలంగాణకు యథాతథంగా కరెంటు సరఫరా అవుతుందని స్పష్టం చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
హుందాతనం లేకుండా ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై అధికార పార్టీ టీఆర్ఎస్ తోపాటు, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ పార్టీలు తీవ్రంగా తప్పుపట్టాయి. టీడీపీ నేతలు ఈ విషయమై కేంద్రంతో మాట్లాడుదామని నిర్ణయించుకున్నారు. ఆంధ్రా ప్రభుత్వం నుండి ఈ ప్రతిపాదన రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర ఇందన శాఖ కార్యదర్శితో మాట్లాడి లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపించారు. లేఖకు స్పందించిన కేంద్రప్రభుత్వం వెంటనే స్పందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయడం కుదరదని, తాము ఆదేసిన్చెంతవరకు తెలంగాణ విద్యుత్ కేటాయింపుల్లో ఎలాంటి మార్పులు చేయరాదని స్పష్టం చేసింది.
ఈ విషయమై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఆంధ్రా సర్కార్ నిర్ణయం తీసుకున్న పీపీఏ రద్దు ప్రతిపాదన పిల్లచేష్ట అని, ఆంధ్రా వాళ్ళు మనకు అన్యాయం చేసినా పట్టించుకోవద్దని, ఇలాంటి సమయంలో చిల్లరగా వ్యవహరించకుండా హుందాగా ప్రవర్తిద్దామని, ప్రజలే అర్థం చేసుకుంటారని అన్నారు. ఇట్లాగైనా చంద్రబాబు వైఖరి ఏమిటో ప్రజలందరికీ మళ్ళీ తెలిసిందని, తెలంగాణకు అన్యాయం చేసే ఉద్దేశంతోనే ఆంధ్రా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు.