ఆదివారం నాడు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ ముఖర్జీని కలిసిన టీ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణపై ఇంకా ఆలస్యం వద్దని, అలా చేస్తే రెండు ప్రాంతాల ప్రజల మధ్య విభేదాలు తలెత్తే అవకాశముందని వివరించారు. సాధ్యమైనంత త్వరగా విభజన ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చర్చ జరక్కుండా ఎలా అడ్డుపడుతున్నారో కూడా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల చేనేత కార్మికులు నేసిన అగ్గిపెట్టెలో పట్టే శాలువాతో రాష్ట్రపతికి సన్మానం చేశారు.
తెలంగాణ పట్ల రాష్ట్రపతి సానుకూలంగా స్పందించడంతో టీ కాంగ్రెస్ ఎంపీలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ భేటీలో పొన్నం ప్రభాకర్, పాల్వాయి గోవర్ధనరెడ్డి, మధుయాష్కీ గౌడ్, సిరిసిల్ల రాజయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.