mt_logo

పొన్నాల దొంగల ముఠా నాయకుడు- కేసీఆర్

పోలవరం డిజైన్ మార్చకపోతే ప్రాజెక్టును అడ్డుకుంటామని, ఆంధ్రా ఉద్యోగులకు ఆప్షన్లు ఉండొద్దని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ మాట్లాడిన పొన్నాల, దామోదర, డీఎస్ లపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన దొంగల ముఠా నాయకుడు పొన్నాల లక్ష్మయ్య. ఆయన చరిత్ర అందరికీ తెలుసు. ఏనాడైనా పొన్నాల ఉద్యమంలో పాల్గొన్నాడా? తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరిగేటప్పుడు వీలయితే అమెరికా, లేకపోతే ఆస్పత్రికి పోయిన ఆయన  కేసీఆర్ ను విమర్శిస్తాడా? ఆయన మంత్రి పదవంతా అసమర్ధుడి జీవనయాత్రలా సాగింది. ఆంధ్రాలోని అక్రమ ప్రాజెక్టులకు అధికార ముద్ర వేసింది పొన్నాలే. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. పోతిరెడ్డిపాడుకు నీటి తరలింపును ఆయన సమర్థించాడు. పొన్నాలకు దమ్ముంటే పోలవరంపై ఆర్డినెన్స్ ను ఆపేయించాలి. పోలవరంకు మేము వ్యతిరేకం కాదు. డిజైన్ మార్చాలని అంటున్నాము. ఆంధ్రాలోని అక్రమ ప్రాజెక్టులకు నీళ్ళు పోనివ్వం. ఆంధ్రోళ్ళకు తొత్తులైన పొన్నాల, డీఎస్ బానిస మనస్తత్వం వదులుకోలేర’ని అన్నారు. దామోదర రాజనర్సింహపై కూడా కేసీఆర్ నిప్పులు చెరిగారు. దామోదర ఎగిరెగిరి పడుతున్నాడని చెప్తూ తెలంగాణ సెక్రటేరియట్ నిండా ఆంధ్రా ఉద్యోగులుండాలా? 90శాతం మంది ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణ సచివాలయంలో ఉండాలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల తీరు సంస్కార హీనంగా ఉందని, తెలంగాణకు న్యాయం జరిగేవరకు కొట్లాడుతానని, తెలంగాణలో 8 జిల్లాలు వెనుకబడ్డవే అని, ప్రపంచంలో ఏ శక్తి నన్ను ఆపలేదని, పిట్ట బెదిరింపులకు తాను భయపడనని తేల్చిచెప్పారు. ‘వచ్చేది జయనామ సంవత్సరం. తెలంగాణకు జయం చేకూరే రోజు త్వరలో రానుంది. తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తాం. త్వరలో తెలంగాణలో అధికారం చేపట్టబోయే పార్టీకి నేను అధ్యక్షుడిని. కీలక శక్తిగా ఉంటేనే ఆంధ్రోళ్ళతో కొట్లాడి మనకు కావలసినవి మనం సాధించుకోవచ్చు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు నోరు మూసుకున్నారు. ఉమ్మడి రాజధాని వద్దన్నం. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ కోరాం. అయినా కేంద్రం పట్టించుకోలేదు. తెలంగాణ గురించి మాట్లాడితే కాంగ్రెస్ నేతలకు బాధెందుకు?’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *