పొన్నాల లక్ష్మయ్య మంత్రిగా ఉన్నప్పుడు నిబంధనలన్నిటినీ ఉల్లంఘించి తనకు లాభం చేకూరేవిధంగా ప్రవర్తించారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. శాసనసభలో పొన్నాల భూ ఆక్రమణ, వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ లో అన్యాక్రాంతమైన భూములపై చర్చ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాంపూర్ గ్రామంలో మొత్తం 106.01 ఎకరాల భూమిని దళితులకు ఇచ్చారని, మొత్తం 128 మంది దళితులకు అసైన్ చేశారని గుర్తుచేశారు. ఈ భూములను తనకే కేటాయించాలని కోరుతూ 1987 లో పొన్నాల కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చిందని, దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములను ఇతరులకు బదిలీ చేయడం కుదరదని కూడా స్పష్టం చేసిందని హరీష్ రావు గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2004లో భూకేటాయింపులు మొదలయ్యాయని, ఏపీఐఐసీకి 81 ఎకరాలు, పొన్నాలకు 8.39 ఎకరాలను అప్పగించిందని, కబ్జా చేసిన భూములను సక్రమం చేసుకునేందుకు పొన్నాల తీవ్ర ప్రయత్నం చేశారని హరీష్ అన్నారు. రూల్స్ పాటించనందుకు 2007లో పొన్నాల కంపెనీకి నోటీసులు జారీ అయ్యాయని, ఆయనకు కేటాయించిన భూములు రద్దు చేశారని చెప్పారు. మార్కెట్ ధర రూ. 10 లక్షల వరకు ఉన్నా, పొన్నాలకు కేవలం రూ. 25,500 కే ఇచ్చారని, ఒకే జీవోలో ఏపీఐఐసీకి వడ్డీ కట్టాలని, పొన్నాలకు వడ్డీ లేకుండా చేయాలని పేర్కొన్నారని మంత్రి చెప్పారు.