ఫార్మా సిటీలో కొనసాగుతున్న మౌలిక వసతుల నిర్మాణం, కంపెనీల నుండి వస్తున్న వివిధ అంశాలపై మంగళవారం టీ ఫైబర్ కార్యాలయంలో పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మాసిటీ కాలుష్యరహితంగా ఉండాలని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాట్లు చేయాలని, సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశం మేరకు ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే పరిశ్రమల శాఖ అధికారులు పలు దేశాల్లోని ఫార్మా క్లస్టర్లను సందర్శించి వచ్చారని, విండ్ ఫ్లో సైతం అధ్యయనం చేశారని, దానికి తగ్గట్లు మాస్టర్ ప్లానింగ్ ఉండాలని అన్నారు. హైదారాబాద్ ఫార్మాసిటీ కూడా అదే స్థాయిలో ఉండాలని చెప్పారు. పనులు వేగంగా జరుగుతున్నాయని, ఫార్మాసిటీకి మంచి స్పందన వస్తున్నదని అక్కడ ఉన్న అధికారులు చెప్పారు.
ఫార్మాసిటీ లివ్, వర్క్, లర్న్ స్ఫూర్తిగా ఏర్పాటు అవుతున్న తరుణంలో అందులో పనిచేసే వారికి అక్కడే నివాస సదుపాయం ఉంటుందని స్పష్టం చేశారు. వాటికి అనుబంధంగా అత్యుత్తమ విద్యాసంస్థలు కూడా ఏర్పాటు అవుతాయన్నారు. ఫార్మా యూనిట్లు అత్యధిక శాతం జీరో లిక్విడ్ డిశ్చార్జిగా ఉంటాయని, ఫార్మాసిటీ వ్యర్ధాలు కేంద్రీకృతంగా శుద్ధి జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ముఖ్య కార్యదర్శులు అరవింద్ కుమార్, రామకృష్ణారావు, జయేష్ రంజన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ మాణిక్ రాజ్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.