హైదరాబాద్ లోని గోషామహల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలీస్ అమరవీరుల స్థూపానికి కేసీఆర్ నివాళులర్పించిన అనంతరం ‘అమరులు వారు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిదని, ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండేది పోలీసులేనన్నారు. పోలీసులను కించపరుస్తూ మాట్లాడటం సరికాదని, పోలీస్ వ్యవస్థను చెడుగా చూడడం దేశానికి మంచిది కాదని, భద్రత ఉంటేనే పెట్టుబడులు వస్తాయని కేసీఆర్ పేర్కొన్నారు.
విధి నిర్వహణలో వీర మరణం పొందినవారు దేవునితో సమానమని, అమరుల కుటుంబాలకు ప్రభుత్వం వందశాతం అండగా ఉంటుందని అన్నారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని పెంచుతున్నామని, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి మరణిస్తే రూ. 40 లక్షలు, ఎస్.ఐ స్థాయి వ్యక్తి అయితే రూ. 45 లక్షలు, సీఐ లేదా డీఎస్పీ స్థాయి వ్యక్తి అయితే రూ. 50 లక్షలు, ఐపీఎస్ అధికారి అయితే రూ. కోటి రూపాయల నష్టపరిహారాన్ని అందిస్తామని, వారంలోగా పరిహారం అందేలా చర్యలుంటాయని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.