పోలవరం ప్రాజెక్టు ద్వారా రెండు లక్షలమందిని దిక్కులేని వారిని చేస్తున్నారని, ముంపుకు గురవనున్న గిరిజనులకు పునరావాసం కల్పిస్తామంటున్న కేంద్రప్రభుత్వం అసలు ముంపే లేకుండా ప్రత్యామ్నాయాలు ఎందుకు ఆలోచించడం లేదని ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. సోమవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో తెలంగాణ రాజకీయ జేఏసీ, వివిధ ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని పోలవరం బిల్లుపై నిరసన వ్యక్తం చేశాయి.
ఈ సందర్భంగా ప్రొ. కోదండరాం మాట్లాడుతూ, పునరావాసం కంటే జీవించే హక్కును కాపాడటం ముఖ్యమని, పోలవరం వద్ద గోదావరి ఉధృతిని తట్టుకోవడానికి సిమెంట్ కాంక్రీట్ కట్టడం అవసరమని, కానీ అక్కడి మట్టి దానికనుగుణంగా లేదని, అందువల్ల రాక్ ఎర్త్ డ్యాంగా దానిని నిర్మిస్తున్నారని, ఆ డ్యాం సురక్షితం కాదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తాడిపూడి, పుష్కర్ వద్ద రెండు డ్యాంలను నిర్మించాలని నిపుణులు సూచించారని, కాంట్రాక్టర్ల జేబులు నింపడంకోసం, కార్పొరేట్ శక్తుల ప్రయోజనం కోసమే ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని విమర్శించారు. కేవలం తెలంగాణకు చెందిన గ్రామాలనే కలుపుతున్న ఏపీ ప్రభుత్వం ఒడిశా, ఛత్తీస్ గడ్ లకు చెందిన గ్రామాలను ఎందుకు కలపలేదని కోదండరాం ప్రశ్నించారు.
అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్ కు చేరుకొని అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద టీజేఏసీతో పాటు పలు సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఎట్టి పరిస్థితుల్లో బిల్లుకు ఆమోదం తెలపొద్దని రాష్ట్రపతిని నేతలు డిమాండ్ చేశారు. గిరిజనులకు అన్యాయం చేసిన ప్రభుత్వాల జాబితాలో మోడీ సర్కారు సైతం చేరిందని, ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజలు ఇప్పుడు ఉద్యమం ద్వారానే తమ ప్రాంతాన్ని రక్షించుకునే శక్తి ఉన్నదని ప్రొ. కోదండరాం అన్నారు. గిరిజనులకు జీవించే హక్కును కల్పించిన రాజ్యాంగానికి పార్లమెంటు ఇచ్చే గౌరవం, విలువ ఇదేనా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.