ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పార్టీ ఎంపీలతో సమావేశమై పోలవరం ఆర్డినెన్స్, హైదరాబాద్ లో గవర్నర్ పాలన అంశాలకు సంబంధించి సుదీర్ఘ చర్చ జరిపారు. పార్లమెంటు వేదికగా ఈ రెండు అంశాలపై దేశవ్యాప్త చర్చ జరగాలని, హైదరాబాద్ పై పరోక్ష పెత్తనానికి యత్నిస్తున్న కేంద్రం చర్యలను ఎండగట్టాలని, రాజ్యాంగ విరుద్ధమైన పోలవరం ఆర్డినెన్స్ ను తీవ్రంగా వ్యతిరేకించాలని సీఎం సూచించారు.
దేశంలోని 28 రాష్ట్రాల్లో అమల్లో లేని అంశాలను తెలంగాణ రాష్ట్రంలో అమలుచేయాలనుకోవడం ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని, కేంద్రం పంపించిన సర్క్యులర్ కు ధీటైన సమాధానం పంపిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. శాంతిభద్రతల వ్యవహారం అన్ని రాష్ట్రాల్లోనూ రాష్ట్రప్రభుత్వాల పరిధిలో ఉండగా, ఒక్క తెలంగాణలోనే ఎందుకు గవర్నర్ కు అప్పగిస్తోందనే విషయాన్ని ప్రధానంగా పార్లమెంటులో చర్చ జరపాలని ఎంపీలకు వివరించారు.
ఈ అంశాలకు సంబంధించి వేరే రాష్ట్రాల ఎంపీల మద్దతు కూడా కూడగట్టాలని, తెలంగాణలో అమలు అమలు చేసినట్లుగానే ఇతర రాష్ట్రాల్లోనూ కేంద్రం ఇదేవిధంగా అమలుచేసే అవకాశం ఉండొచ్చని వారికి వివరించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హక్కులకు భంగం కలిగితే రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలకు కూడా ఇదే పరిస్థితి వస్తుందనే అంశాన్ని బలంగా తీసుకెళ్లాలని చెప్పారు. ఇదిలా ఉండగా సోమవారం నుండి జరిగే పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు పార్టీ ఎంపీలు బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. గవర్నర్ కు అధికారాలు కట్టబెట్టడం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని దెబ్బతీయడమేనని, పార్లమెంటులో ఈ విషయంపై కేంద్రాన్ని నిలదీస్తామని ఎంపీలు స్పష్టం చేశారు.