పోలవరం ఆర్డినెన్స్ బిల్లును అడ్డుకోవాలని తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గడ్ ఎంపీలు ఎంతగా ప్రయత్నించినా మూజువాణి ఓటుతో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ తెచ్చి రాష్ట్ర సరిహద్దులను మార్చాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, చట్ట వ్యతిరేకమని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లు ఆమోదంతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలైన కుక్కునూరు, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, భద్రాచలం(భద్రాచలం పట్టణం మినహా ఇతర గ్రామాలు), వేలేరుపాడు, బూర్గంపాడు(సీతారామనగరం, పెద్దరావిగూడెం, గుంపెనపల్లి, గణపవరం, ఇబ్రహీంపట్నం, శ్రీధర బేలేరు) తదితర గ్రామాలు ఏపీలో కలవనున్నాయి.
తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గడ్ లకు చెందిన 52వేలకుపైగా కుటుంబాలను నిలువునా ముంచేసే ఈ బిల్లుపై ఎంతగా పోరాటం చేసినా చివరకు ఎన్డీయే ప్రభుత్వం పట్టించుకోకుండా బిల్లును మూజువాణి ఓటుతో గట్టెక్కించింది. పోలవరం బిల్లును అడ్డుకోవాలని తెలంగాణ జేఏసీ, గిరిజన సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. పోలవరం బిల్లుపై అటు లోక్ సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
బిల్లుపై ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని, నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోపెట్టి పరిష్కరించాలని కోరినా కేంద్రానికి ఇవేవీ పట్టలేదు. కేకే, వీహెచ్, రాపోలు ఆనందభాస్కర్ రాజ్యసభలో గట్టిగా తమ వాదనలు వినిపించారు. తాము పోలవరం పాజెక్టుకు వ్యతిరేకం కాదని, కేవలం డిజైన్ మాత్రమే మార్చాలని కోరుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కూడా బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించగానే తెలంగాణ, ఛత్తీస్ గడ్, ఒడిశా ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇంతజరుగుతున్నా టీడీపీ, బీజేపీ సభ్యులు ఏమీ మాట్లాడకపోవడం విశేషం.