mt_logo

తెలంగాణపై కాలకూట విషం…

-అల్లంనారాయణ

పటాన్‌చెరు దాటగానే మీ వాహనాలను అడ్డుకునే ఆటంకం ఒకటి ఉంటుంది. అద్దాల గదులతో నిర్మితమై కాలడ్డం పెట్టినట్టు కట్టె అడ్డంపెట్టే ఆ టోల్‌గేట్ మీ మీ తోలు వలిచి పైసలు వసూలు చేసి మీకు దారి ఇస్తుంది. మీ ఊర్లో మీరు, మీ ప్రాంతంలో మీరు స్వేచ్ఛగా తిరగలేమా? అనుకునే సహజన్యాయాన్యాయాల ప్రశ్న అక్కడ తలెత్తితే మీమీద చెయ్యెత్తే మనుషులు కూడా ఉంటారు. కనుక బుద్ధిగా తోలు సారీ టోల్ వలిపించుకుని మీ ప్రాంతాల్లో మీరు తిరిగేసెయ్యొచ్చు. ఈ టోల్‌గేట్ కావూరి సాంబశివరావుది. ఇప్పుడాయన రోడ్డుకు కాదు ఏకంగా తెలంగాణకే అడ్డంపడ్తున్న పారిశ్రామిక వేత్త. రోడ్లూ ప్రైవేట్ పరం చేసి బీవోటీ పద్ధతిలో వేసిన కాణ్నుంచి ఇదే నమూనా. ఇది సరళీకరణ విధానాల తర్వాత అభివృద్ధి నమూనా. ప్రైవేట్ పెట్టుబడులు పెంచి మౌలిక సదుపాయాలు కల్పించే నమూనా. ఇటు విమానాశ్రయానికి వెళ్లేందుకు వేసుకున్న పదమూడు కిలోమీటర్ల వంతెన కావొచ్చు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు మల్లెపూల తోటలను మింగి ఇచ్చిన భూమి కావొచ్చు. అటు విజయవాడకు వెళ్లే నాలుగులేన్లుగా వెడల్పౌతున్న రహదారిలో భవిష్యత్‌లో మొలిచేవి కావొచ్చు, వరంగల్ రహదారిలో వెలుస్తున్న వసూల్ రాజాల అడ్డాలు కావొచ్చు. అన్నింటి సారమొక్కటే. నిర్మించు… వసూలు చేసుకో… ఈ వసూలు చేసుకునే విధానాన్ని నిశ్శబ్దంగా అంగీకరించినాం, అంగీకరిస్తున్నాం కాబట్టి, ఇక్కడి కాంట్రాక్టర్ల, పెట్టుబడిదారుల, కార్పొరేట్ల రూట్లు దేశవ్యాప్తం, విశ్వవ్యాప్తం అయివున్నవి కాబట్టే ఇవ్వాళ్ల కావూరి సాంబశివరావు ప్రధాని వద్ద తెలంగాణకు అడ్డంగా, ఒక ఆటంకంగా, అడ్డం పొడుగూ అబద్ధాలాడుతూ ‘కావూరి విషం’ కక్కగలుగుతున్నాడు.

బహుశా అర్థం చేసుకోగలిగితే తెలంగాణను విధ్వంసం చేసింది, దోచుకుంటున్నది, తెలంగాణ ప్రజలను కూలీలను, బానిసలను, బిచ్చగాళ్లను చేసి, ఎదిగిన కార్పొరేట్ మహాసామ్రాజ్యాలు నిర్మించుకోగలిగిన పాలకపక్షాన్ని నిర్మాణం చేసుకోగలిగిన సీమాంధ్రలోని గుప్పెడుమంది గుత్త పెట్టుబడిదారులే. అందుకే ప్రధాని కూడా, వాషింగ్టన్ పోస్టు చెప్పిన మౌనాన్ని కాస్తవీడి, విషాదంగా ‘అవును నాకు అన్నీ తెలుసు’ అంటాడు. సారాంశంలో తెలంగాణను ఇప్పుడు అడ్డుకుంటున్నది దోచుకుంటున్నది గుప్పెడు మంది పెట్టుబడిదారులే. వీళ్లే అడ్డగోలు వాదనలు, అన్యాయపు ఆరోపణలు, తప్పులతడకల లెక్కలు, విశ్లేషణలు చెప్పి తెలంగాణ ఆకాంక్ష మీద కాలకూట విషం కక్కుతున్న శక్తులు.

ఎంపీలంటే కొంత విచక్షణా జ్ఞానం ఉంటుందని అనుకుంటాం. తెలంగాణ ఎందుకు ఇవ్వకూడదో? చెప్పడంలో వారికి బలమైన వాదనలేవో ఉన్నాయనుకుంటాం. కనీసం ఆశిస్తాం. సమైక్యంగా ఉంటే తెలుగువాళ్లంతా ఒక్కటిగా ఉంటే బాగుంటుందని వాదనలేవో చేస్తారని ఊహిస్తాం. కానీ తెలంగాణ పట్ల గుడ్డిద్వేషం, తెలంగాణ ప్రజల పట్ల చిన్నచూపు, వాస్తవాలను పూర్తిగా అబద్ధాలుగా చెలామణి చెయ్యడం మొన్న ప్రధానిని కలిసిన ఎంపీల పత్రం సారాంశం. దీని సూత్రధారులు ఎవరైతే రోడ్ల మీద దర్జాగా టోల్‌గేట్లు పెట్టి చట్టబద్ధంగా దాదాగిరీ చెయ్యగల స్థితిలో ఉంటారో? వారే తెలంగాణ రాకుండా టోల్‌గేట్లు పెట్టగలిగిన పెట్టుబడిదారులు. అయిదు పేజీల ఎంపీల పత్రం పచ్చి అబద్ధాల పుట్ట.

ఒక్కొక్కటి చూద్దాం. సమైక్య రాష్ట్ర ప్రకటన తర్వాత చిన్నపాటి ఆందోళనలు ఉండొచ్చు. తర్వాత అవి కనుమరుగైపోతాయి. ఆరు నెలల్లో పూర్తిగా కనుమరుగైపోతాయి. బహుశా ఇంతకన్నా అన్యాయమైన, దుర్మార్గమైన తప్పుడు అంచనా మరొకటి ఉండబోదు. పైగా రాష్ట్రంలో అనిశ్చితి కొనసాగవద్దు. కొనసాగితే పార్టీకి నష్టం అని చెప్పే ఈ పత్రంలో తెలంగాణ ఉద్యమం పట్ల ఉన్న అహంకారపూరితమైన చిన్నచూపు ఉంది. సూట్‌కేసులు, ధనరాసులు ప్రభుత్వాల్ని, ప్రపంచబ్యాంకు విధానాలను ప్రభావితం చెయ్యగలవేమో కానీ, ప్రజల ఆందోళనలను అదుపు చెయ్యలేవనే విషయం తెలియని దుర్బేధ్యమైన అజ్ఞానం కలిగిన ఆ ఎంపీల ప్రతిభా పాటవాలను ఎట్లా అర్థం చేసుకోవాలి. నిజంగానే తెలంగాణ ఉద్యమం ఆగుతుందా? అది సెప్టెంబర్ 30ని కలవరిస్తూ ఉన్నది. పలవరిస్తూ ఉన్నది. కలగంటూ ఉన్నది. అయినా కాంగ్రెస్‌పార్టీకి తెలంగాణ ఇప్పటికే శూన్యాలను చూయించింది. బహుశా ఆరునెలల్లో ఆగడం కాదు. తెలంగాణ వచ్చేదాకా పోరాటం సాగడం తప్ప తెలంగాణ ముందు మరో దారి లేదు. నిలువు నిలువునా ఒక ఆకాంక్ష కోసం కాలిపోయిన వీరులగన్న నేల ఇది.

ప్రాంతీయ అసమానతలు ఉంటే ప్రత్యేక ప్యాకేజీలు ప్రత్యేక మండళ్లు ఉంటే సరిపోతుందని మరో సూచన. తెలంగాణ ఉద్యమం స్వభావానికి, డిసెంబర్ 9 ప్రకటనకి, ప్రత్యేక ప్యాకేజీలకు ఏదన్నా లంకె ఉందా? కనీసం బోడిగుండుకు మోకాలుకున్నట్టయినా. అన్నింటికన్నా తెలంగాణను చిన్నబుచ్చే తీవ్ర ఆరోపణలు చేశారు కావూరి ప్లస్ బృందం.

రాష్ట్ర విభజన తీవ్రవాదం మతఛాందసవాదానికి ప్రోత్సాహమిస్తుందన్నదే ఆ అభాండం. తెలంగాణలోనే కాదు అది వామపక్షవిప్లవాలైనా, మత ఛాందసవాదమైనా ఇవ్వాళ్ల దేశవ్యాప్త వెల్లడులు. కానీ తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్‌కు గంగా జమునా తెహజీబ్ అనే పేరుంది. భిన్న మతాలవారు, భిన్న ప్రాంతాల వారు, భిన్న జాతులు సమైక్యంగా జీవనం సాగించిన చరిత్ర ఉంది. ఇతరులను ఆదరించి అన్నంపెట్టి అక్కున చేర్చుకుని, ఆలింగనం చేసుకునే నేల ఇది. హైదరాబాద్ అల్లర్ల మూలాలు మళ్లీ ఇదే పెట్టుబడి పంకిలంలో, ప్రయోజనాల్లో ఉంటుంది. కానీ సహజీవనాన్ని ఆచరించి చూపిన ఒక హైదరాబాద్ గుండెకాయ గల తెలంగాణను అనే దురహంకారానికి మూలం ఎక్కుడుంది? ఎవరు వారు? సమైక్యంగా ఉండాలని కోరుకునే వాడికి ఉండాల్సిన బుద్ధీ జ్ఞానం ఇదేనా?ఇంకా ఎంత దుర్మార్గమంటే విభజన అయితే తెలంగాణ అసోం తరహా మారే అవకాశం ఉంది. ఈ కావూరి విషానికి వెనుక ఇంతటి అహంకారం వెనుక, అది చెల్లుబాటు కావడం, చెలామణి కావడం వెనుక ఒక బలుపు ఉన్నది. కానీ చరివూతలో ప్రతిపెట్టుబడిదారీ బలుపు వాపుగా నిరూపణ అయింది. ఎవరిచ్చారీ అహంకారపు మాటలని మాట్లాడే హక్కన్నదే ఇప్పటి ప్రశ్న.

విద్యుత్తు వినియోగంలో తెలంగాణ, ఆంధ్ర రాయలసీమల కంటే ఎంతో ముందున్నది. మిగతా ప్రాంతాల కన్నా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందని చెప్పడానికి ఇదే నిదర్శనం అన్నది మరో పచ్చి అబద్ధం. ప్రాంతీ య అసమానతలు అనడం ఈ వాదనకు తద్విరుద్ధం. తెలంగాణలో కరెంటు బావుల ఆధారిత వ్యవసాయం గురించి, హైదరాబాద్ గురించి తెలిసిన వాళ్లెవరూ ఈ పచ్చి అబద్ధం ఆడరు. వ్యవసాయ వినియోగ కరెంటు, హైదరాబాద్ కేంద్రంగా పరిశ్రమలకు వినియోగించే కరెంటు తీసేస్తే తెలంగాణ వినియోగం సులభంగానే తెలుస్తుంది. ఎంపీలకు ఈ మాత్రం జ్ఞానం ఉండదనుకోలేదు. కానీ పచ్చి అబద్ధాలు అయినా ఆటంకం పెట్టడం వాళ్ల లక్ష్యం.

కొంతమంది రాజకీయ నిరుద్యోగుల ఉద్యమంగా మరో దుష్ప్రచారం. ఇది తెలంగాణ బలవంత విలీనమంత పురాతన అబద్ధం. ఎనిమిది వందల పైచిలుకు బలిదానాలు జరిగిన ఒక ఉద్యమం గురించి మాట్లాడే మాటలివి. రాజకీయ ఉద్యోగులో, నిరుద్యోగులో గీపెడితే రేగే ఉద్యమాల్లో స్వచ్ఛంద మరణాలుండవు. బలిదానాలు ఉండవు. ఆత్మలు మేల్కొని అనుసంధానం అయిన ఈ ఉద్యమంపై ఇంత చిన్న చూపు ప్రదర్శించిన వారి వక్రబుద్ధిని ఏమనాలి?

ఎన్నికల గురించీ అంతే. తెలంగాణ ఉద్యమం ఊరూరికి, వాడవాడకూ విస్తరించి, తెలంగాణ కోసం ఒక రాజకీయ పార్టీ ఏర్పడిన తర్వాత ఉప ఎన్నికలూ ఒక్కొక్కసారి వాదాన్ని బలంగా నిలబెట్టడానికి ఉపయోగపడ్డాయి. నాలుగేళ్లకే తీసుకున్న కాంగ్రెస్ పార్టీ శాతాలను చూసినా , తెలుగుదేశం పార్టీ ఓట్ల శాతాలను చూసినా అవి ఎట్లా దిగజారుతున్నాయో సులభంగానే అర్థమవుతుంది. ఒక్క ఈ ఎంపీలకు తప్ప.

ఒక్క పరకాల ఎన్నికలో 33 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి కనుక, మిగతా పార్టీలకు 67 శాతం వెళ్లాయి కనుక తెలంగాణ వాదం లేదనడం బధిరాంధత్వం కాక మరేమవుతుంది. పరకాల ఎన్నికల్లో తెలంగాణ అనని పార్టీ ఏదన్నా ఉందా? ఇప్పటికైనా తెలంగాణ అంశం లేకుండా ఎన్నికల్లో నిలబడే మొనగాడెవడైనా ఉన్నాడా? సిగ్గులేని ఈ ఎంపీల పార్టీకి అందరికన్నా తక్కువ ఓట్లెందుకు వచ్చాయి. అన్ని ఉప ఎన్నికల్లోనూ, అధికారంలో ఉండికూడా బొక్కబోర్లా పడ్డా కూడా ఇలాంటి విశ్లేషణలు, అబద్ధాలు అధిష్టానానికి ఇచ్చేవాళ్ల మెదళ్లలోనన్నా తేడా ఉండాలి లేదా వాటిని స్వీకరించే వారి మెదళ్లన్నా మరోరకంగా ఉండాలి. పైగా తెలంగాణకు వలసలు పెరిగాయని, అవి 18 శాతమని మరో అబద్ధం. కాకిలెక్కలు.

తెలంగాణ అసోం అయితది అనేవాడివి, తెలంగాణకు ఇంతమంది ‘ఏం… బీక వచ్చినట్టు’అని ‘పొమ్మంటె పోవేందిరా పోరా ఓ వలసదొరా’ అని అడగడం ఇవ్వాళ్టి అవసరం ఇంకా పెరిగింది.తెలుగువారిని విభజిస్తే ఒక్క రాష్ట్రంలో ఆగదు. గ్రేటర్ హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రా, ఉత్తరాంధ్ర, గ్రేటర్ రాయలసీమ డిమాండ్లు వస్తాయని మరో ఊహ పరికల్పన. వచ్చినా అది తెలంగాణకు, డిమాండ్‌కు ఏం సంబంధమో అర్థం కానిదేమీ కాదు.

సరే. ఇట్లాంటి అపసవ్యపు విశ్లేషణలు, వక్రీకరణలలో కూడిన ఈ పత్రం వెనుక దాగిఉన్న అంతర్గత వలసాధిపత్య పెత్త నం ఒక్కటే కారణం కావొచ్చు. ఈ అహంకార మూలాలు టోల్‌గేట్లలో ఉన్నాయి. ఇవ్వాల్టి వలసవాది మూలం అంతర్జాతీయ విపణిలో ఉంది. బహిరంగ మార్కెట్‌లు ఖులాయించడంలో ఉంది. సరళీకరణ తర్వాత అడ్డపంచె కట్టుకున్న వలసవాది, సూటూబూటు వేసుకున్న వలసవాది కార్పొరేటై, సూట్‌కేసులు అందించి ‘మేనేజ్’ చేసే ప్రభుత్వాల్లో ఉంది. అందుకే తెలంగాణ సమ స్య పైకి కనబడేంత సులభ సమస్య కాదేమో. అది పెట్టుబడి విస్తరణ పాతుకుపోయిన సమస్య కూడా అనే అవగాహన ఇప్పటి అవసరం.అవునూ మీ వద్ద ఉద్యమాలు లేవు కదా! అని వాయలార్ రవి ఇదే ఎంపీలతో అన్నారు. తెలంగాణ ఇస్తే వస్తాయని ఎంపీల జవాబు. దేన్నైనా తయారు చేయగల ఈ దురహంకార ఆధిపత్యవాదులు రేపు మేనేజ్డ్ ఉద్యమాలూ తయారు చేస్తారన్నమాట. అందుకే ఇలాంటి పెట్టుబడిదారుల ఆర్థిక మూలాలు ధ్వంసం చేయకుండా తెలంగాణ రాదనే వాళ్ల మాటలకు బహుశా విలువ పెరిగిందేమో. బహుశా రాకపోతే భవిష్యత్తులో అది తప్ప మరే దారీ లేదేమో.

[నమస్తే తెలంగాణ నుండి]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *