వివిధ జిల్లాలనుండి హైదరాబాద్ కు పొట్ట చేత పట్టుకుని వచ్చి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు, షెడ్లు, ఇండ్లు నిర్మించుకుని నివాసముంటున్న పేదల స్థలాలకు ఉచితంగానే క్రమబద్ధీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్రమబద్ధీకరణకు రూపొందించాల్సిన మార్గదర్శకాలపై మంగళవారం సచివాలయంలో అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవ్వకుండా చూసేందుకే క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపడుతున్నామని, ప్రతి భూమికి టైటిల్ కలిగి ఉండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.
అసెంబ్లీలో చేసిన తీర్మానం, అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పేదవారిపట్ల సానుభూతితో వ్యవహరిస్తామని, 125 గజాలలోపు స్థలాలను ఉచితంగానే క్రమబద్ధీకరించాలని, 250 గజాల వరకు స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకుంటే వారికి రిజిస్ట్రేషన్ ధరలో 50 శాతం తీసుకుని క్రమబద్ధీకరణ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 500 గజాల వరకు స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ ధరలో 75 శాతం తీసుకోవాలని, 500 గజాలకు పైగా ఉన్న స్థలాల్లో నివాసం ఏర్పాటు చేసుకుంటే 100 శాతం రిజిస్ట్రేషన్ ధర చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలని కేసీఆర్ సూచించారు.
2014 జూన్ రెండవ తేదీలోపు నివాసం ఉంటున్నవారికే క్రమబద్ధీకరణ అవకాశం కల్పించాలని, సంబంధిత ప్రాంతంలో తాము నివాసం ఉంటున్నట్లు ఆధారాలు చూపాలని, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డులాంటివి ఏవైనా దరఖాస్తుతో జతచేయాలని చెప్పారు. అంతేకాకుండా ఎలాంటి నిర్మాణాలు లేకుండా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని వేలం వేయాలని నిర్ణయం తీసుకున్నారు.
క్రమబద్ధీకరణ తర్వాత మహిళల పేరిటే పట్టాలు ఇవ్వాలని, అధికారులు విచారణ జరిపే సమయంలో ఏ ప్రాంతంలో, ఎంత స్థలంలో, ఏ ఇంట్లో నివాసం ఉంటున్నారో గుర్తించి ఫొటోలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రాజ్యసభ సభ్యుడు కేకే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బీఆర్ మీనా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎన్. శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.