నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల శాసనమండలికి టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. తొలి ప్రాధాన్య ఓట్లలో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్ రావు కంటే 12,723 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 1,53,541 ఓట్లు పోలవగా, 14,039 ఓట్లు చెల్లలేదు. మరో 5,956 ఓట్లు నోటా కింద వెళ్ళాయి. అవి పోగా మిగిలిన వాటిలో మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులోనే పల్లా 44.74% ఓట్లను దక్కించుకున్నారు.
మొదటినుండి ప్రతి రౌండ్ లోనూ పల్లా ఆధిక్యతలోనే ఉన్నారు. మొత్తం చెల్లిన ఓట్లలో సగం అంటే 66,777 ఓట్ల మాజిక్ ఫిగర్ చేరుకోవడానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి 7,013 ఓట్ల దూరంలో నిలిచారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్ రావుకి 19,736 ఓట్లు అవసరం. దీంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను అధికారులు లెక్కించడం ప్రారంభించారు. లెక్కింపు కార్యక్రమం మొత్తం పూర్తి కాగానే పల్లా రాజేశ్వర్ రెడ్డి 66,777 మేజిక్ ఫిగర్ కు చేరడంతో ఆయన విజయం ఖరారు అయ్యింది. అనంతరం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నల్గొండ పట్టణంలో బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఎన్జీ కాలేజీ నుండి పెద్ద గడియారం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్, ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.