ఈనెల 24న ఎల్బీ స్టేడియంలో జరగబోయే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు భారీ ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నట్లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్లీనరీ, బహిరంగ సభ కోసం 7 కమిటీలు వేశామని, 27న పరేడ్ గ్రౌండ్ లో జరిగే భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ప్లీనరీ సమావేశం జరిగే రోజే పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని, రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యవహరిస్తారని పల్లా పేర్కొన్నారు. హైదరాబాద్ నగరమంతా గులాబీమయం చేస్తామని, ప్లీనరీకి 36వేల మంది హాజరవుతున్నారని చెప్పారు. ప్లీనరీలో మొదటినుండి చివరి వరకు సీఎం కేసీఆర్ కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుంటారన్నారు. జిల్లాకు లక్ష చొప్పున మొత్తం పది జిల్లాలనుండి పది లక్షల మందితో పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగసభను నిర్వహిస్తామని పల్లా రాజేశ్వర్ రెడ్డి వివరించారు.