పాలమూరు, డిండి పథకాలు పాతవేనని, ఏపీ సీఎం చంద్రబాబు కొత్తవని చెప్తున్నవన్నీ అబద్ధాలేనని పాలమూరు అఖిలపక్ష నేతలు సోమవారం ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. పాలమూరు పథకాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని, తమ హక్కులను కాపాడాలని, బాబు ఆరోపణలలో వాస్తవాలు లేవంటూ గవర్నర్ కు ఆధారాలు అందజేశారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోలను సైతం అందులో పొందుపరిచారు.
ఉమ్మడి రాష్ట్రంలో 2013 ఆగస్టులో జీవో నం. 72 ద్వారా పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇస్తే, డిండి పథకానికి 2007 లో జీవో జారీ అయ్యిందని చెప్పారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకే ఈ పథకాలని, నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య తీరాలన్నా, పాలమూరు నుండి వలసలు ఆగిపోవాలన్నా ఈ ప్రాజెక్టులు కట్టడం అత్యంత ఆవశ్యకమని అన్నారు. వాస్తవాలను కేంద్రంతో పాటు కేంద్ర జలవనరుల శాఖకు, అపెక్స్ కమిటీ, కేంద్ర జలసంఘానికి మీరు తెలపాలని అఖిలపక్ష నేతలు గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు.
వినతిపత్రం ఇచ్చిన వారిలో టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత, ఎంపీ జితేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, మంత్రులు జూపల్లి, సీ లక్ష్మారెడ్డి, తెలంగాణ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు ఎస్ నిరంజన్ రెడ్డి, ఆచారి(బీజేపీ), ఆలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్, బాల నర్సింహులు(సీపీఐ), ఎడ్మ కృష్ణారెడ్డి(వైసీపీ), ఏ నారాయణ(లోక్ సత్తా), ఎండీ జహంగీర్(ఎంఐఎం), బాబుల్ రెడ్డి(ఆప్)తదితరులు ఉన్నారు.