౽౽ జే ఆర్ జనుంపల్లి
పాలమూరును ఆ జిల్లా ప్రజలు, బైబిలు లో వర్ణించిన ‘పాలు, తేనే కలిసి ప్రవహించే ప్రాంతం పాలస్తీనా’ అను రీతిగా, పాలు జాలు వారే ప్రదేశంగా భావించి, అభిమానించి ప్రేమిస్తారు. కానీ నిజానికి , నేటి పాలస్తీనాలాగే పాలమూరు జిల్లా కూడా గట్లు,గుట్టలు బీడువారిన భూములతో ఈసురోమంటూ కనిపిస్తూ ఉంటుంది. అయితే పాలస్తీనియుల లాగే పాలమూరు ప్రజలు కూడా ఈ రాయి రప్పల మధ్య నిరంతరం పాలధార వెతుక్కుంటూనే ఉన్నారు. బహుశా జిల్లాలో ప్రవహిస్తున్న కృష్ణ, తుంగభద్ర, భీమా నదులనుచూసి, ఎప్పుడైనా, ఈ నదులు ఈ జిల్లా ప్రజల జీవితాల్లో పాలు పండిస్తాయనే ఆశ వారిని అలా ఆలోచింపచేసి, పాలమూరు అని పేరు పెట్టు కోవడానికి కారణమై ఉండవచ్చు.
ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన ఈ 55 ఏండ్ల లో ఆ కల నిజం కాలేదు. పైగా ఉన్ననీరు కూడా సీమాంధ్రుల దోపిడీ పాలై ఇక్కడి ప్రజల జీవితాలు దుర్భరమై, ఇతర ప్రాంతాలకు, దేశాలకు వలసలు పోయి బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి శ్రామికులు, వారి కండలు కరిగించి , చెమటోడ్చి , దేశ విదేశాల ప్రాజెక్టులలో పాలమూరు లేబరుకు వారి కష్టానికి,నిజాయితీకి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టినారు. అయితే రాష్ట్రంలో ఆంధ్రులకు మాత్రం వారు వెనుక బడిన, తెలివి తక్కువ వాళ్ళు. పాలమూరు రైతుల అరిగోసలు రాష్ట్రములో ఎక్కడ లేని విధంగా ఉంటాయి. వీరి వర్షంతో జూదంలాగా సాగే వ్యవసాయం, ఒక్క పంటపండితే రెండు పంటలు ఎండే విధంగా ఉంటుంది . సాగు నీటి ప్రాజెక్టుల కింద, ప్రతి ఏటా పంట చవిచూసే రైతులు వీరిని సోమరులని, సేద్యం చెయ్యటం తెలియని వాళ్ళని అపహాస్యం చేస్తుంటారు. ప్రకృతి నిర్దయగా వీరితో ఇలాంటి పరిహాసము చేస్తుంటే, పులి మీద పుట్రలా ‘బోర్ వెల్ టెక్నాలజీ’ వీరిని సర్వ నాశనం చేస్తున్నది. గత్యంతరము లేక రైతులు వేసుకొన్న వేలాది బోరువెల్స్ తో వాగుల్లో వంకల్లో నీరుపారకుండా ఆగిపోయింది. ఊర్లల్లో ఉన్న చిన్న, పెద్ద చెరువులలో నీరు లేకుండా పోయింది. తమ వృత్తి మానుకోలేక, ఆశ చంపుకోలేక రైతులు నిస్సహాయులై, మొండిగా ఒకటి తర్వాత ఒకటి బోరుబావులు తవ్వుతూనే ఉన్నారు. అవి క్రమంతప్ప కుండ ‘ఫెయిల్’ అవుతూనే ఉన్నాయ్. ఇలాగ ప్రతి రైతు 5 – 50 బావులు తవ్వి తమ కష్టార్జితం చాలక, శక్తికి మించిన అప్పులు చేసి, పూర్తిగా క్రుంగి కృశించి, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. రెండు పంటలకు ధోకాలేని గోదావరి జిల్లాల రైతులే వ్యవసాయం గిట్టుబాటు లేక ‘క్రాప్ హాలిడే’ ప్రకటిస్తూ ఉంటే, ఈ అశోపహతులు ఏం చెయ్యగలరు? ఊరూ, భూమి విడిచి పరాయి భూముల్లో జీవనం వెతుక్కొంటూ వలసబాట పట్టడం తప్ప. దీని కంతటికీ కారణం ఈ ‘ఆంధ్ర’ ప్రభుత్వాల దాష్టీకం. ఈ జిల్లా ప్రజల వనరులను ఒక క్రమపద్ధతిలో దోచుకొని, వీరిని తిరుగులేని వెనుకబాటుతనంలోకి నెట్టి వేస్తున్నారు.
పాలమూరు జిల్లా ముంగిట ప్రవహించే కృష్ణా నదిలో, ఆ జిల్లా వాటా నూరో, నూట ఇరవై టి ఎం సి లు. మరి అవి ఇప్పుడు ఎక్కడ పోతున్నాయి. కృష్ణా నది మీద మొట్ట మొదటి ప్రాజెక్టు ‘జూరాల’ 17.5 టి ఎం సి ల నుండి 11 టి ఎం సి లకు కుదించబడింది . ఈ ప్రాజెక్టు కట్టాలనుకొని ఎన్ని సంవత్సరాలైంది. మొత్తం మీద ఇప్పుడు కట్టినప్పటికీ ఇప్పటికీ 5 – 6 టి ఎం సి ల కంటే ఎక్కువ ఉపయోగంలోకి రాలేదు. నైజాము కాలంలో కట్టిన తుంగభద్ర ప్రాజెక్టు నుండి, 89 వేల ఎకరాలకు నీటి వసతి కల్పిస్తే,అదీ కూడా చూసి భరించలేక కాలువ తమ భూభాగంలోనుంచి వస్తున్న కారణంగా, దౌర్జన్యంగా కే సి కెనాల్ కు దారి మళ్ళించి , కేవలము 30 వేల ఎకరాలకు మాత్రమే నీరు రానిచ్చినారు. ఇప్పుడు అది కూడా జూరాల ఆయకట్టు లెక్కలో కలిపేసి మొత్తం నీటిని సీమ వాసులే దోచుకొంటున్నారు. కృష్ణా నది మీద నైజాం కాలంలోనే, ఒప్పుదల జరిగి నిర్మాణానికి సిద్ధంగా ఉన్న నెట్టెంపాడు, భీమా వగైరా ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రంతో కలిసిన పాపానికి కాలదోషం పట్టి భ్రష్టుపట్టి పోయినాయి. కాలువలతో గంగా భాగీరథీల్లాగా పరుగులిడవలసిన ఈ ప్రాజెక్టులు, ఇప్పుడు కడితే గిడితే పాలమూరు ప్రజలమెడల్లో గుదిబండలయ్యే ఐరావతల్లాంటి ఎత్తిపోతలకు రూపాంతరము చెందినాయి. ఇప్పుడు 55 ఏండ్ల తర్వాత అవి ఆంధ్రుల పుణ్యమా అని తెలంగాణా పాలిటి కొరివి దయ్యం లాంటి ‘జలయజ్ఞం’ లోపురిట్లోనే సంధి కొట్టేఎత్తిపోతల ప్రాజెక్టులుగా కునారిల్లుతున్నాయి. అవి ఎప్పటికైనా వెలుగు చూస్తాయా? చూస్తే గీస్తే వాటిని నడపడానికి కావలసిన విద్యుత్తు ఎక్కడుంది. 30 లక్షల ఎకరాల ఆయకట్టు అంచనా తో మొదలు పెట్టిన ఎస్ ఆర్ ఎస్ పి 40 ఏండ్లైనా ఇంతవరకు మొదటి దశనే పూర్తి కాలేదు. ఎప్పుడూ దానికింద సాగు 5 లక్షల ఎకరాలకు మించలేదు. ఆంధ్రుల పుణ్యమా అంటూ ఆ ప్రాజెక్టు ఇప్పుడు చావు దశలో ఉంది. చంద్రబాబు కాలంలో ఎస్ ఆర్ ఎస్ పి కి కాలువల మరమ్మత్తుకు 12 సం.ల లో 12 రూ.లు కూడా ఇవ్వలేదు. గద్వాలలో పుష్కలంగా నీరు ఉన్నహేమగడ్డలాంటి చిన్న ఎత్తిపోతలనే వివక్షతో భ్రస్టు పట్టించింది ఈ ‘ఆంధ్ర’ ప్రభుత్వం. ఇప్పుడు ఆదిలోనే అడ్డంపడిన, దేవాదుల పగిలిపోతున్న పైపుల కింద ఎకరానికి 12000 – 14000 రూ.లు ఖర్చుపెట్టి నీరు ఇస్తారంట. ఐరావతాల్లాంటి ఈ ఎత్తిపోతలను పూర్తి చేసి, వాటికీ కావలసిన లెక్కకు మించిన విద్యుత్తును ఉత్పత్తి చేసి తెలంగాణాకు నీళ్ళు ఇవ్వడమనేది కలలో భక్ష్యాలు తిన్నంత నిజం. ఇప్పుడు రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తు అన్ని అవసరాలకు కలిపి 8000 మెగా వాట్లైతేమన ఎత్తిపోతలను నడిపించడానికి 12000 మెగా వాట్ల విద్యుత్తు అవసరమని అభిజ్ఞ వర్గాల అంచనా. ప్రస్తుత పరిస్థితిలో ఎత్తిపోతలు అనివార్యమనుకొంటే, ఖర్చుతో కూడుకోన్నప్పటికీ వీటి కొరకే ఉద్దేశించబడిన (captive) పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం అవసరం. తెలంగాణ ఇంజనీర్లు ప్రతిపాదించిన ఇలాంటి ‘పాలమూరు ఎత్తిపోతల’ పథకాలకు, సర్వే చెయ్యడానికి సంవత్సరాలుగా బతిమిలాడు తున్నప్పటికీ, ఇంతవరకూ ఉలుకూ పలుకూ లేదు. మరోప్రతిపాదన , జూరాల నుండి పాకాల వరకు కాలువల ద్వారా 10 లక్షల ఎకరాల ప్రాజెక్టు గురించి ఆలోచించే నిజాయితీ లేదు.
శ్రీశైలం విద్యుత్తు ప్రాజెక్టును బహుళార్థక ప్రాజెక్టు కింద ఇష్టారాజ్యంగా మార్చి వేసి,ప్రాజెక్ట్ డ్రాడౌన్ లెవెల్స్ పెంచి, పాలమూరు నికర జలాలను కొల్లగొడుతున్నారు. మనకు 1981 లో తల పెట్టిన ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టును సొరంగమా, ఎత్తిపోతలా అని కువాడపు డైలమా లో పెట్టి , తిరిగి దానిని సాగర్ నుండి ఎత్తిపోతల అని రూపురేఖలు లేని ప్రాజెక్టుగా మార్చి, దానిని నిరంతరంగా ఒక ఎరగా చూపిస్తూ వరద జలాల పేరుతో ఎస్ ఆర్ బి సి ద్వారా తలపెట్టిన అక్రమమైన నూటొక్క సీమ ప్రాజెక్టులు శరవేగంతో పూర్తిచేసే ప్రయత్నం యధేచ్చగా మన కళ్ళముందే జరుగుతూనే ఉంది. కర్నూలు కడపలతోపాటు, పెన్నా బేసిన్ లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు కూడా పాలమూరు నీరునుతీసుకు పోతున్నారు. దీనికై 11 టిఎంసి ల పోతిరెడ్దిపాడు రెగులేటర్ ను 44 కు ( నిజానికి 60 టిఎంసిలు) పెంచినారు. ఈ విధంగా అక్రమంగా దారి మళ్లించిన నీటిని నిలువ చేసుకొని వాడుకొనుటకు ఖండలేరు, వెలుగోడు, బ్రహ్మంగారి రిజర్వాయర్, సోమశిల వగైరా 250 టిఎంసిలకు మించిన నిలువ సామర్థ్యం కల రిజర్వాయర్లను కట్టుకున్నారు.ఇదీ చాలక కొల్లాపూర్ కు చేరువలో సిద్దేశ్వరం దగ్గర శ్రీశైలం రిజర్వాయరులో కొల్లాపూర్, ఆత్మకూరు ప్రాంతాలను కలుపుతూ ఒక బ్రిడ్జి ప్రాజెక్టు ప్రతిపాదనను, మోసంతో ఒక మెగా వియరు (wier) గా మార్చి, కృష్ణా నదినే మళ్ళించి రాయలసీమ కు నీరు తరలించే దుర్మార్గపు ప్రయత్నం జరుగు తున్నది.
150 ఏండ్ల పైబడిన కృష్ణా, గోదావరి మట్టి బారేజిలను, రెండు మూడు సార్లు గట్టిగా మరమ్మత్తు చేసుకొని, పైన తెలంగాణాలో ప్రాజెక్టులు కట్టకుండా చెరువులు,కుంటలు పూడేటట్లు చేసి కృష్ణా గోదావరి నీళ్ళు నిరాటంకంగా కిందికి వచ్చేటట్లు చేసి ఈ బారేజిల కింద ఆయకట్టును రెండింతలకు ఎక్కువ పెంచుకొన్నారు. అదీ చాలదన్నట్లు, కోస్తాంధ్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కృష్ణా, గోదావరి డెల్టా ఆయకట్టును స్థిరీకరణ చేయడానికి గోదావరి బేసిన్ నుండి 80 టి ఎం సి ల నీరును కృష్ణా బేసిన్ కు మళ్ళించి, చింతపల్లి, దమ్ముగూడెం, పోలవరం ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ విధంగా కోస్తాంధ్ర అవసరాలను తీర్చి, దిక్కు, దివాణం లేని పాలమూరు ,నల్లగొండ జిల్లాల అధీకృత కృష్ణా జలాలను, పి పి రెగులేటర్ ద్వారా వారి దొంగ ప్రాజెక్టులను నింపుకోవడానికి’ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కృష్ణా,గోదావరి తెలంగాణా జలాలను, సీమకు తరలించుకు పోవటానికి, స్థిరీకరణ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి ఎస్ ఎల్ బి సి లాగానే తెలంగాణాఎత్తిపోతల పథకాలను ఎరలు గా చూపిస్తున్నారు. పాలమూరు రైతుల గతి పాడు బడిన బోరు బావి గుంతలైతే, ఆంధ్రులకు వారు అన్యాయంగా ఇబ్బడి ముబ్బడిగా పెంచుకొన్న ఆయకట్టుకు స్థిరీకరణ ప్రాజెక్టులు కావాలి. వారికి బిరా బిరా పరుగులెత్తే కాలువల ప్రాజెక్టు లైతే, తెలంగాణాకు ఎప్పటికీ పూర్తికాని సొరంగాలు లేదా పురిట్లోనే సంధి కొట్టే ఎత్తిపోతల పథకాలు ఇస్తారు. ఆ తెలంగాణా ఎత్తి పోతల పథకాలు ఈ ఉమ్మడి ఆంధ్ర ప్రభుత్వంలో ఎన్నటికీ పూర్తి కావు. అయినా వాటిని నడపడానికి అయ్యేఖర్చును తెలంగాణా రైతులకోరకు ఖర్చు పెట్టే ఆలోచన కానీ, నిబద్ధత కానీ ఈ ఆంధ్ర పాలకులకులేదు. ఉమ్మడి రాష్ట్రం లో ఎస్ ఆర్ ఎస్ పి, ఎన్ ఎస్ పి ఎడమ కాలువ, మంజీరా, నిజాం సాగర్ ప్రాజెక్టుల చరిత్ర చూస్తూనే తెలుస్తుంది వీరి దుర్మార్గం. ఏ తెలంగాణా ప్రాజెక్టును చూసినా ఏమున్నది గొప్ప, ఆంధ్రుల కుట్రల, కుతంత్రాల పరపీడన పరాయణత్వం తప్ప.
కేంద్ర, ఆంధ్ర ప్రభుత్వాలు చెప్పుకొనే జలయజ్ఞం ప్రపంచంలోనే ఒక ‘కొలాస్సల్ ఫ్రాడ్’. ఇది దేశీయ, అంతర్జాతీయ జలవినియోగ సూత్రాలకు పూర్తిగా విరుద్ధం. ఇది అత్యంత దారుణమైన ‘పైరసీ’. గత 55 సంవత్సరాలల్లో ఆంధ్ర ప్రభుత్వాలు చేసిన అన్యాయానికి తెలంగాణా ప్రజల జీవితాలు రెండు, మూడు తరాలు వెనక్కి నెట్ట బడ్డాయి. ఈ జల ‘పైరసీ’ ని పూర్తి కానిస్తే వారి బతుకులు మరు భూములు కాక తప్పవు.ఈ విషయం ఆంధ్రులకు బానిసలైన మన ప్రజా ప్రతినిధులకు ఎలాగూ అర్థం కావడం లేదు, మన ప్రజా బాహుళ్యం ఈ విషయం అర్థం చేసుకొని అతి తీవ్రంగా స్పందించాల్సి ఉంది.
జలయజ్ఞం లోదేశంలో కనీ వినీ ఎరుగని స్థాయిలో నీటి న్యాయ సూత్రాలను ఉల్లంఘించి, తెలంగాణా జలాలను శాశ్వతంగా దోచుకొని పోయే ప్రయత్నం జరుగుతున్నది.ఇటీవల ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ లో వ్రాశారు. జలయజ్ఞం లో గత ఆరేడు ఏండ్లలో 72000 కోట్ల రూ.ల ఖర్చు జరిగిందని, కానీ ఆయకట్టు ఏమాత్రము పెరగలేదని కేంద్ర ప్రభుత్వయంత్రాంగం అభిప్రాయ పడినట్లు. ఈ వేల కోట్ల రూ.లు నదీ జలాల్లో కొట్టుకు పోయినట్లు అభిప్రాయపడింది ఆ పత్రిక. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా స్పందించినట్లు లేదు. దీని పూర్తి స్వరూపం బయట పడడానికి చాల సమయం పట్టవచ్చు.కానీ అప్పటికే జరగవలసిన, సరిదిద్దుకోలేనంతటి నష్టం జరగక తప్పదు.ఈ ‘ఫ్రాడ్’ లో జరిగిన తప్పులకు నిజంగానే శిక్ష వేయాలంటే ‘నూరెంబర్గ్ ‘ స్థాయిలో విచారణ జరప వలసి ఉంటుందంటే అతిశయోక్తికాదు. ప్రపంచములో ప్రజాస్వామ్య సమాజాల్లో ఇది అత్యంత దుర్మార్గమైన, మోసపూరితమైన దోపిడీ అని ముందు ముందు చరిత్ర తెలియ జేస్తుంది. అన్ని రంగాలు ఉద్యోగాలు,చదువులు, సాగు నీరు, బొగ్గు, పవర్, గనులు వగైరాలలోకూడా ఇదే వివక్ష, ఇవే కుట్రలు, కుతంత్రాలు. ఒక్క సాగు నీటి ప్రాజెక్టులను విశ్లేషించి చూస్తే చాలు ఆంధ్రులెంత దురాశతో దుర్మార్గంతో మన ఒనరులను దోచుకోన్నారో.వీరితో కలిసినందువల్ల మనకెంత నష్టం జరిగిందో.ఇంకా కలిసి ఉంటె మన గతి ఏమౌతుందో ,అనే విషయం తెలుసు కోవడానికి.
ఇలాంటి నిరంతర నీటి దోపిడీతో సంపాదించిన లక్షలతో, మరియు వారికున్న రాజకీయ మెజారిటీ తో తెలంగాణా లోఉన్న ఒనరులన్నీ ఇష్టా రాజ్యంగా దోచుకొని ఇక్కడ మిలియన్లు, బిలియన్లు సంపాదిస్తున్నారు. తెలంగాణాను తమ జాగీరుగా భావిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలను ఒక క్రమ పద్ధతిలో రెండవ తరగతి నాగరికులుగా మారుస్తున్నారు.ఇది వెనకటి ‘సెర్ఫ్ డం’, ‘స్లేవరీ’ లకు మరో రూపం అని చెప్పుకోవచ్చు.ఈ రాజకీయ దుర్మార్గంలో అత్యంత నష్ట పోయింది, పాలమూరు జిల్లా. అత్యంత ఎక్కువ సాగు నీటిని పోగొట్టు కొన్నది కూడా పాలమూరు జిల్లానే.పోగొట్టుకొన్నది కేవలము సాగు నీరే కాదు, ఈ 55 ఏండ్ల కాలంలో పాలమూరు యువత ఆంధ్రుల వివక్షతో,మన నాయకుల చేతకాని తనంతో, అభివృద్ధి అవకాశాలలో రెండు మూడు తరాలు వెనక్కి నెట్టి వేయబడి అలమటిస్తున్నారు. ఇక రాజకీయంగా అ నాటి మన తెలంగాణా నాయకులు తమకు ఇష్టం లేక పోయినా, నెహ్రో లాంటి పెద్దల మాటలకు మొహమాటపడి ఈ వలస పాలనను మన నెత్తిన రుద్దారు. నెహ్రూ తన విజ్ఞతకు వ్యతిరేకంగా ఈ దరిద్రాన్ని మనకు అంట గట్టాడు. ఒప్పందాలు, నమ్మకాలూ బూడిదలో పోసిన పన్నీరైనాయి. ఆంధ్రుల దుర్మార్గం, దార్శనికుదు ఫజల్ అలీ ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు మించి పోయింది.నేడు వాళ్ళతో కలిసి బతకడం దుర్భరమై పోయింది. ఈ వలస రాజ్యంలో, పాలమూరు జిల్లాదోపిడీ కాబడ్డ నదీ జలాలు, ఎండిన చెరువులు, పాడు బడిన బోరు బావుల పాలిన బడిఎడారిగా మారి పోతున్నది. ఆంధ్రులతో కలిసి ఉండి మన ప్రాంతం అభివృద్ది చేసుకోవడం అనేది మృగ తృష్ణ లో దప్పి తీర్చుకోవడం లాంటిది అని ఈ గత 55 సం.ల లో మనము నేర్చుకొన్న భీకర సత్యం.
ఈ జిల్లాలో తెలంగాణా ఉద్యమ ప్రభావం అంతగా లేదని ఆంధ్రులు చేస్తున్న ప్రచారాన్ని వమ్ము చేస్తూ ఏకంగా ఒక కాంగ్రెస్ మంత్రి తన మంత్రి పదవికి పార్టీ కి రాజీనామా చేసి, మరొక ముఖ్యమైన టి డి పి నాయకుడు తమ పార్టీని విడిచి పెట్టి తెలంగాణా ఉద్యమంలో అగ్రభాగాన నిలిచి ఉద్యమిస్తున్నారు.పైగా ఇప్పుడు తెలంగాణాలో జరుగుతున్న 6 ఉప ఎన్నికల్లో 3 ఇక్కడ జరుగుతుండటం గమనించ దగ్గ విషయం. తెలంగాణా ఏర్పాటుకు అసలు సిసలైన అవరోధం ఆంధ్రులకు సహకరిస్తున్న సోనియా గాంధీ, ఆమె కోటరీ. అసలు తెలంగాణ 55 ఏండ్ల అరిగోసకు కారణం, నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీలే.మరొక తెలంగాణా బద్ధ శత్రువు చంద్రబాబు నాయుడు. తెలంగాణా అస్తిత్వమన్నా, ప్రజలన్నా అతనికి ఒక ఏవగింపు. ఈ రెండు పార్టీలు కలిసి 2004 సం. నుండి ఇప్పటి వరకు తెలంగాణా ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలతో అతి దుర్మార్గమైన రాజకీయ నాటకాలు అడుతున్నారు. ముఖ్యంగా 9 , డిసెంబరు 2009 తర్వాత ఈ రెండు పార్టీల జుగుప్సాకరమైన రాజకీయాలు ప్రజలకు పూర్తిగా అర్థమైనవి. తెలంగాణా వాదం ఇంతకు ముందు కంటే ఎక్కువ ప్రజల గుండెల్లో చెలరేగుతున్నది. తెలంగాణ, ఆంధ్ర తో కలిసి ఉండి ఒక జీవచ్చవం లాగా మారింది, ఇంకా కలిసి ఉంటె పూర్తిగా చావడం ఖాయం ,అనే విషయం అందరికీ బోధ పడింది . తెలంగాణా ప్రజలు గత కొన్ని శతాబ్దాలలో, కేవలం ఒక 5 సం.లు (1950 – 1956) బూర్గుల రామకృష్ణా రావు గారినేతృత్వంలోతమ ప్రభుత్వాన్నితాము నడుపుకొన్నారు. మిగతా సమయమంతా పరాయి పాలన లో మగ్గడం జరిగింది. ఇప్పుడు మనం, పర పాలనలో మనకు జరిగిన అన్యాయాల్నిసరి దిద్దుకొని మన అభివృద్ది మనం సాధించు కోవాలంటే, మన రాష్ట్రము మనకు కావాలి. మన పరిపాలన పూర్తిగా తెలంగాణా ప్రజల చేతల్లో నే ఉండాలి. మన ప్రాంతం గురించి మనమే నిర్ణయాలు తీసు కోవాలి. అది జరగ కుండా తెలంగాణా ఉద్యమాన్ని ఆపడమే రాష్ట్ర ఎజెండా గా, ఆంధ్రులైన రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కుమ్మక్కైరాత్రింబగళ్ళు పని చేస్తున్నారు . వారి ప్రయత్నాల్ని ఓడించాలంటే మనం మన రాష్ట్రం సాధించడానికి ఉద్యమం మరియు ఎన్నికల ద్వారా నిరంతరం పోరు సాగించ వలసిందే. ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే అత్యంత లాభ పడే జిల్లా కూడా పాలమూరే. పోరాడితే పొయ్యేదేమీ లేదు పాలమూరుకు.బానిస సంకెళ్ళు తప్ప. కాంగ్రెస్ లేదా టిడిపి కి వోటు వేస్తే బానిస సంకెళ్ళే. శతాబ్దాల బానిసత్వం నుండి బయట పడాలంటే , తెలంగాణా రాష్ట్రం కొరకు తెలంగాణ రాష్ట్ర సమితికి వోటు వేయడం తప్ప వేరే మార్గం లేదు. తెలంగాణా శత్రు పార్టీల ప్రలోభాలకు లోబడి వేరే ఏ మార్గం పట్టినా నిరంతర బానిసత్వం అనుభవించాల్సిందే.