గత పాలకుల నిర్లక్ష్యం వల్లే చెరువులు విధ్వంసం అయ్యాయని, సమైక్య రాష్ట్రంలో చెరువుల అభివృద్ధిని పట్టించుకోలేదని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మిషన్ కాకతీయపై సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పక్కా ప్రణాళికతో చెరువుల పునరుద్ధరణ చేపడతామని స్పష్టం చేశారు.
జడ్చెర్ల మండలంలోని బాడేపల్లిలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. రూ. 2.75 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కవర్ షెడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 6 జిల్లాల్లో గోదాంల కొరత ఉందని, మహబూబ్ నగర్ జిల్లాలో ఈ కొరత ఎక్కువగా ఉందన్నారు. వచ్చే మూడేళ్ళలో గోదాంల నిర్మాణం చేపడతామని, అంతేకాకుండా 79 సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేస్తున్నట్లు కూడా హరీష్ చెప్పారు.