నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జరిగిన బాల్కొండ టీఆర్ఎస్ అభినందన సభలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజాసేవే ధ్యేయమని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కృషి చేస్తామని, కార్యకర్తలు లేకుండా పార్టీ లేదని, పదవులు లేవని అన్నారు. కార్యకర్తల ఆశయాలమేరకు అభివృద్ధి జరుగుతుందని, కార్యకర్తలు గ్రామాల్లో తలెత్తుకుని తిరిగేలా చేస్తామని కవిత పేర్కొన్నారు.
2001సం.లో జలదృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఆ సామాగ్రినంతా చంద్రబాబు బయటపడేయించారని, ఆ తర్వాత మోతె మట్టిని తీసుకువచ్చిన కేసీఆర్ చంద్రబాబు ఆశ్చర్యపోయేలా తెలంగాణ భవన్ నిర్మించారని గుర్తుచేశారు. నిజామాబాద్ తో పాటు ప్రతి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఎంపీ కార్యాలయాలు ప్రారంభిస్తానని, జిల్లాను గులాబీమయం చేసిన ఇందూరు గడ్డపై మినీ తెలంగాణ భవన్ నిర్మిస్తామని ఆమె చెప్పారు. ఏ అవసరం వచ్చినా దరఖాస్తు చేసుకుంటే పనిపూర్తిచేసి తామే కబురు చేస్తామని కవిత హామీ ఇచ్చారు.