mt_logo

పచ్చపార్టీ వారికి పిచ్చిమాటలు ఎక్కువ – కేటీఆర్

టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఎల్బీ స్టేడియం వచ్చిన ఐటీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. తెలంగాణ తెలుగుదేశం నాయకులకు చీమూ, నెత్తురు ఉంటే బానిస బతుకులు వీడాలని, తెలంగాణ ప్రజా కంఠకుడిగా ఉన్న చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగుతూ అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని అన్నారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి తట్టుకోలేని పచ్చపార్టీ నేతలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, పచ్చ కామెర్లు ఉన్న వారికి లోకమంతా పచ్చగానే కనపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రుణమాఫీ, అమరుల కుటుంబాలను ఆదుకోవటం లాంటి అనేక పథకాలు చేపడుతున్న సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారో లేక రుణమాఫీ చేయని చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ప్రజలకు స్వేచ్ఛ లభించిందని, తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం బానిసలుగానే బతుకుతున్నారని, చంద్రబాబు, బీజేపీ నేత వెంకయ్యనాయుడుకు వీళ్ళు తొత్తులుగా మారి అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నారన్నారు. మెదక్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా తెలంగాణ టీడీపీ నేతల తీరు మారలేదని, ఏమాత్రమైనా సత్తా, చేవ ఉంటే అభివృద్ధికి సహకరించాలని కేటీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *