mt_logo

పాలమూరు ఎత్తిపోతల పథకంపై కుట్రకు తెరలేపిన బాబు!

హైదరాబాద్ పై మరో కుట్రకు పాల్పడుతున్న చంద్రబాబు పై మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ కృష్ణా బేసిన్ లో ఉందని, హైదరాబాద్ కు కావాల్సిన నీటి కేటాయింపులను గత ప్రభుత్వం చేయలేదని, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిలిపేయాలని కేంద్రానికి బాబు లేఖ రాశాడని చెప్పారు. చంద్రబాబు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడానికే ఇట్లా విషం చిమ్ముతున్నాడని, హైదరాబాద్ ప్రజలకు తాగునీరు లేకుండా చేస్తున్నాడని మండిపడ్డారు.

బాబు హైదరాబాద్ లో అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ తెలంగాణకు నీళ్ళు, విద్యుత్ రాకుండా చేస్తున్నాడని, హైదరాబాద్ లో గవర్నర్ పాలన కోసం కేంద్రానికి గతంలో కూడా లేఖలు రాశాడని, ఇన్ని కుట్రలు చేస్తున్న చంద్రబాబుకు హైదరాబాద్ లో ఉండే అర్హత లేదని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ పూర్తిచేసి తీరుతామని హరీష్ స్పష్టం చేశారు. టీటీడీపీ నేతలు బానిస బతుకు మానుకోవాలని, తెలంగాణ ప్రజల పక్షం ఉంటారో, చంద్రబాబు పక్షాన ఉంటారో తేల్చుకోవాలని సూచించారు. ఎర్రబెల్లికి, రేవంత్ రెడ్డికి రైతులపై ప్రేమ ఉంటే చంద్రబాబు కుట్రలపై నిలదీయాలన్నారు.

కృష్ణానది నుండి తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి మంచినీరు అందిస్తే అభ్యంతరం లేదు కానీ, మన హైదరాబాద్ కు తాగునీరు తెచ్చుకుంటామంటే మాత్రం తప్పా అని హరీష్ ప్రశ్నించారు. హైదరాబాద్ లో సీమాంధ్ర సచివాలయం, క్యాంప్ ఆఫీస్, అసెంబ్లీ అన్నీ నడుపుకుంటూ, ఇక్కడ నీళ్ళు వాడుకుంటూ హైదరాబాద్ కు తాగునీరు ఇవ్వొద్దనడం ఆయన విషపు బుద్ధికి నిదర్శనమని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *