mt_logo

ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ మంజూరులో నిబంధనల్ని సడలించాలి: మంత్రి కొప్పుల ఈశ్వర్

మాసబ్ ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించేందుకు ఆసక్తి చూపే విద్యార్థులకు 20లక్షల చొప్పున ప్రభుత్వం ఉచిత సహాయం చేస్తోందని, ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఇటువంటి గొప్ప పథకం మన తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదని అన్నారు. అయితె ఈ పథకం కింద ఎంపికయ్యే విద్యార్థుల్లో ఎస్సీలు తక్కువగా ఉన్నారని, ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఉన్న నియమాలలో కొన్ని సడలింపులు ఇస్తూ.. మానవతా దృక్పథంతో సాధ్యమైనంత సరళ పద్ధతుల్లో ఎంపిక జరిగితే బాగుంటుందని మంత్రి కొప్పుల అభిప్రాయపడ్డారు. ఈ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం గురించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో మరింత అవగాహన పెంపొందించి, వీలైనంత ఎక్కువ ప్రచారం కల్పిస్తే ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవచ్చని అన్నారు. అలాగే సాంఘిక సంక్షేమ వసతి గృహాల నిర్వాహణలో మరిన్ని సంస్కరణలు చేపట్టాలని, విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్య, పోషక విలువలతో కూడిన ఆహారం అందేలా చూడాలని, సాయంత్రం పూట ట్యూటర్లను పెట్టి పాఠాలు చెప్పించాలన్నారు. వసతి గృహాలపై అధికారుల నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు ఉండాలని, సంక్షేమాధికారులతో అప్పుడప్పుడు టెలి, వీడియో కాన్ఫరెన్స్ లు జరుపుతూ.. విద్యార్థులు పట్ల సేవా దృక్పథంతో, మరింత బాధ్యతాయుతంగా పని చేసేలా చూడాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను కోరారు. అంతేకాకుండా హాస్టళ్లలో తలెత్తే చిన్న చిన్న మరమ్మతులను ఎప్పటికప్పుడు త్వరగా పూర్తి చేయాలని, విద్యార్థులు శుభ్రత పాటించేలా, క్రమశిక్షణతో మెలిగేలా, చదువు పట్ల మరింత శ్రద్ధ చూపేలా, ఉన్నతంగా ఎదిగేలా తగు జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు ప్రభుత్వ కార్యదర్శి విజయ్ కుమార్, కమిషనర్ యోగితారాణ, అధికారులు హన్మంతు నాయక్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *