హాఫెజ్ ఉస్మాన్.. మక్కామసీదు ఇమాం, (నవాబ్ మహబూబ్ అలీఖాన్.. అన్వరుల్ ఉలుమ్ కళాశాల కార్యదర్శి)
మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో ముస్లింలు, వారి విద్యారంగంపై దృష్టి పెట్టండి. వారికి సౌకర్యాలు కల్పించండి. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఉచిత విద్యాబోధన జరిపిస్తామన్నారు. ముస్లింల సమస్యల పరిష్కారానికి కృషి చేయండి. అన్ని విధాలా తెలంగాణను అభివృద్ధి వైపు తీసుకెళ్ళండి. ఎన్నికల ముందు ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయండి.
-ముఖ్యమంత్రి: సలాం పేష్ కర్‌తాహు. షుక్రియా అదాకర్తాహు (సలాం చేస్తున్నా. మీరు నాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా). ముస్లింలలో నిరుద్యోగం, విద్యా, దారిద్య్ర సమస్య అధికంగా ఉంది. ముస్లింలు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. వారు అలాగే ఉంటే సమస్యలు పరిష్కారం కావు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. ఎన్నికల్లో నేను ఇచ్చిన హామీ మేరకు చేస్తున్నా. మైనారిటీ అభ్యర్థిని డిప్యూటీ సీఎం చేస్తానన్నాను.. మహమూద్ అలీని చేశాం.
ముస్లింల కోసం రూ.వెయ్యికోట్ల బడ్జెట్ ఇస్తామన్నాను. నిన్ననే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం. వక్ఫ్ భూములు అన్యాక్రాంతమైపోతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. వారందరు దోచుకున్నారు. ఇలాంటి భూములను వక్ఫ్‌బోర్డుకు తిరిగి ఇప్పిస్తాం. వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పిస్తూ నిన్ననే నిర్ణయం తీసుకున్నాం. 12% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పాను. కొందరు అమలుకాని హామీ అంటూ ఎద్దేవా చేశారు. అయితే ఇరాదే పక్కే హైతో రాస్తే నికల్ ఆతే హై (చిత్తశుద్ధి ఉంటే దారులు వాటంతట అవే వస్తాయి). తప్పకుండా ఆ రిజర్వేషన్లను అమలు చేసి చూపిస్తాం.
శ్రీనివాసరెడ్డి, తడకమళ్ల (మిర్యాలగూడ)
తడకమళ్ల నుంచి ఇసుక అక్రమంగా రవాణా జరుగుతోంది. మూసీనది, పాలేరు వాగు నుంచి ఇసుకను తరలిస్తున్నారు. దీనివల్ల పంట, పొలాలు చెడిపోతున్నాయి. రోడ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయి.
– ముఖ్యమంత్రి: ఇసుక రవాణా జరుగకుండా చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం.
కుమార్, ఖమ్మం
రుణమాఫీ ఎప్పటి నుంచి అమలు చేస్తారు?
-ముఖ్యమంత్రి: వెంటనే అమలు చేస్తాం.
వెంగళ్, (యూఎస్‌ఏ)
కొన్ని దళిత కుటుంబాలకు 30ఎకరాలు ఇచ్చి, సహకార సేద్యం చేయిస్తే బాగుంటుంది. ప్రవీణ్‌కుమార్‌లాంటి అధికారులను ప్రోత్సహించాలి.
-ముఖ్యమంత్రి: సహకార వ్యవసాయం గతంలోనే విఫలమైంది. రష్యాలో కూడా విఫలమైంది. ఒక్కో కుటుంబానికి 3 ఎకరాలు చొప్పున ఇస్తే వారి పనులు వారు చేసుకుంటారు. ప్రవీణ్‌కుమార్ నిజంగా ఉత్తమ అధికారే. విద్యకు సంబంధించిన అంశాల్లో ఆయనకు బాధ్యతలు అప్పగిస్తాం.
నవీన్‌కుమార్, పుణె
ఖమ్మం జిల్లాకు చెందిన నేను స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నాను. ఈనాడు నా గ్రామం పోలవరం ముంపులో భాగంగా ఏపీకి వెళ్లిపోయింది. తెలంగాణ వచ్చినందుకు ఆనందపడాలో, నా గ్రామం ఆంధ్రలో కలిసిపోయినందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. నాకు తెలంగాణకు రావాలని ఉంది.
-ముఖ్యమంత్రి: కేంద్రం దుర్మార్గంగా వ్యవహరించి ముంపు మండలాలను ఏపీలో కలిపేసింది. తెలంగాణ వచ్చినందుకు సంతోషపడాలో.. ఏడు మండలాలు ఆంధ్రలో కలిసినందుకు బాధపడాలో తెలియడం లేదు. కేంద్రంలోని పెద్దలు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.. ఇప్పుడు చేయగలిందేమీ లేదు. భూములు కోల్పోయినవారికి మార్కెట్ విలువ ప్రకారం అందేలా మేము ప్రయత్నిస్తాం. ముంపు మండలాలకు చెందినవారు తెలంగాణకు వస్తామంటే.. స్వాగతం పలుకుతాం.
రహమాన్, మెదక్
మేము ఏండ్ల తరబడి తక్కువ జీతాలకు ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్నాం. మాకు పర్మినెంట్ చేయించి, జీతాలు పెంచేలా చూడాలి.
-ముఖ్యమంత్రి: మీరు పనిచేసే కంపెనీ వివరాలు తెలుపండి. యాజమాన్యంతో జీతాల విషయంలో మాట్లాడుతా.
తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారి ప్రధాన సమస్యగా ఉన్న డిపెండింగ్ ఉద్యోగాల విషయం?
-ముఖ్యమంత్రి: త్వరలో సింగరేణిపై సమీక్ష జరుపుతాం. ఇచ్చిన హామీ ప్రకారం డిపెండింగ్ ఉద్యోగాలిప్పిస్తాం. తీపి కబురు అందిస్తాం.
దేశపతి శ్రీనివాస్, గాయకుడు
గిరిజన గ్రామాలను పంచాయతీలుగా ప్రకటించడం వెనుక?..
-ముఖ్యమంత్రి: గ్రామంలో తండా ఒక భాగంగా ఉండటంవల్ల తండా అభివృద్ధి చెందడం లేదని గిరిజనుల అభిప్రాయం. తండానే పంచాయతీ అయితే అభివృద్ధి చేసుకుంటామని వారి ఆశ. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం తండాలను పంచాయతీలుగా ప్రకటించాం. అభివృద్ధి జరుగుతున్నది.
జ్వాలా నరసింహారావు, (సీఎం సీపీఆర్వో)
మ్యానిఫెస్టో ప్రకారం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నది. డిపార్ట్‌మెంట్లవారీగా ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులు చెప్పింది విని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి మీడియా కూడా సహకరించడం అభినందనీయం.
వినోద్‌కుమార్, వికారాబాద్
వికారాబాద్‌ను జిల్లాగా మారుస్తున్నారా?
– సీఎం: వికారాబాద్‌ను జిల్లాగా మారుస్తున్నాం. మీకు శుభాకాంక్షలు.
జగన్, ఉప్పల్
ప్రభుత్వ హాస్పిటళ్లలో వసతులు ఎప్పుడు మెరుగుపడతాయి?
-ముఖ్యమంత్రి: గత ప్రభుత్వాలు ప్రభుత్వ హాస్పిటళ్లను పెంటకుప్పలు చేశాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో నిమ్స్ స్థాయి హాస్పిటళ్లను ఏర్పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
బొల్లారం నుంచి నరసింగరావు: చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తారా?
-ముఖ్యమంత్రి: తప్పకుండా. రూ.200కోట్లుకన్నా తక్కువ పెట్టుబడితో ఉండే పరిశ్రమలను చిన్న పరిశ్రమలంటారు. మీరు ఒకసారి సెక్రటేరియట్‌కు రండి మనం ఈ విషయంపై చర్చిద్దాం.
హైదరాబాద్ నుంచి సుదర్శన్: హైదరాబాద్ మాస్టర్ ప్టాన్ గురించి ..
-ముఖ్యమంత్రి: ఆంధ్రాబాబులు హైదరాబాద్‌ను తలదన్నే నగరాన్ని నిర్మించుకుంటామని కలలు కంటున్నారు. వారు గొప్ప నగరాన్ని నిర్మించుకోవాలి. వాళ్లు అభివృద్ధి చెందాలి. అయితే హైదరాబాద్ వంటి మహానగరాన్ని నిర్మించడం ఇప్పుడు నిజాం నవాబ్‌కు కూడా సాధ్యం కాదు. పౌర సమాజం సహకరిస్తే హైదరాబాద్‌లో గుణాత్మకమైన మార్పులు తీసుకువస్తాం. కొద్ది సంవత్సరాల్లో హైదరాబాద్ జనాభా మూడు కోట్లకు చేరుకుంటుందనే ఆలోచనతో ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
చెన్నమనేని రాజేశ్వర్‌రావు
పంచాయతీ అధికారాల బదలాయింపు ఎప్పటినుంచి?
-ముఖ్యమంత్రి: రాజేశ్వర్‌రావు తన జీవితమంతా ప్రజల కోసం పనిచేశారు. నిక్కచ్చిగా మాట్లాడటం ఆయన అలవాటు. అందుకే ఎప్పటినుంచి పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు చేపడుతారని అడిగారు. పంచాయతీరాజ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అందులో భాగంగా అపార్డ్‌లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లకు శిక్షణాతరగతులు నిర్వహిస్తాం. అధికారాల బదలాయింపుపై దృష్టి సారించాం.
యాంకర్: ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఉద్యమ కారులతో సంబంధాలు కొనసాగించడానికి వీలు ఉంటుందా?
-ముఖ్యమంత్రి: సీఎం అయిన తర్వాత తెలంగాణ భవన్‌కు రావడం తగ్గింది. పని ఒత్తిడి వల్ల గతంలో మాదిరిగా ఉద్యమకారులను కలువలేకపోవచ్చు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు బాధపడవద్దు. ఎన్ని జన్మలెత్తినా వారి రుణం తీర్చుకోలేను. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలు ఉంటాయి. వాటిలో ప్రజలను నేరుగా కలుసుకుంటాను.
ఘంటా చక్రపాణి: భారీ వరాలు కురిపిస్తున్నారు? బడ్జెట్ ఎలా ఉండబోతోంది? పథకాల అమలుకు నిధులున్నాయా? అనే సందేహం వ్యక్తమవుతున్నది. ఎయిడెడ్ కాలేజీల క్రమబద్ధీకరణ విషయంలో ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతుందా అనే సందేహం వ్యక్తమవుతున్నది?
-ముఖ్యమంత్రి: రెండో ప్రశ్న అర్థం కాలేదు. మొదటి ప్రశ్నకు సమాధానం చెప్తాను. చాలా హామీలు ఇస్తున్నారు. అమలవుతాయా? అనే సందేహం చాలామందిలో ఉంది. ఈ అంశంపై చాలా వేదికలపై ప్రకటించాను. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు. వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతం. తెలంగాణలో అన్ని వనరులు ఉన్నాయి.
ఆదాయం సర్‌ప్లస్. మిగులు రాష్ట్రం. ఈ విషయాన్ని చాలామంది పుస్తకాల్లో రాశారు. ప్లాన్-నాన్‌ప్లాన్ బడ్జెట్ కలిసి రూ.75 వేల కోట్లు ఉంటుంది. ఇందులో రూ. 40 వేల కోట్లు నాన్‌ప్లాన్. మిగతా రూ. 35 వేల కోట్లు ప్లాన్ బడ్జెట్. పాత బకాయిలను వసూలుచేస్తే వనరులకు ఢోకా ఉండదు. కొంత ఆర్థిక క్రమశిక్షణ కూడా అవసరముంటుంది. రుణాలమాఫీకే అధికంగా నిధులు ఖర్చవుతాయనే అనుమానముంది. ఆర్‌బీఐతో ప్రభుత్వం ఈ రుణాలపై చర్చ జరుపుతోంది.
ప్రతి ఏటా వడ్డీ ప్రభుత్వం చెల్లించడంతోపాటు నాలుగైదు వాయిదాలలో అసలు చెల్లించేలా ప్రణాళికలు రూపొందించాం. అంతేగాకుండా నిజాం నవాబు చేసిన పనుల వల్ల తెలంగాణలో అపారమైన భూ సంపద ఉంది. కొన్ని ప్రాంతాల్లో విలువైన స్థలాలను భూబకాసురులు ఆక్రమిస్తున్నారు. ప్రభుత్వం కూడా రక్షించలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ భూమలును గుర్తించి, వీటిపై సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి అమ్మకాలు చేపడుతాం.
సింగరేణి, ఇతర గనుల ద్వారా రాయల్టీ వస్తుంది. ఇక పెట్టుబడులను కూడా ఆకర్షిస్తాం. మన రాష్ట్రం దేశంలోనే బెస్ట్‌గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణకు ఏ మాత్రం పోటీలేదు. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ సరితూగదు. ఐఐటీఆర్‌వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు తెలంగాణకు వస్తున్నాయి. వీటిద్వారా అభివృద్ధి జరుగుతుంది. ప్రజల జీవన ప్రమాణస్థాయి పెరిగి పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం ద్వారానే పథకాలను అమలుచేస్తాం. అన్ని వనరులను ఉపయోగించుకుని రాష్ట్రాన్ని ఔరా? అనిపించేలా, దేశం ముక్కున వేలేసుకునేలా అభివృద్ధి చేస్తాం.
దేశపతి శ్రీనివాస్: రాష్ట్ర ప్రభుత్వ పాలనను అస్థిరతపరిచే కుట్రలు చేస్తున్నారు. గవర్నర్ పాలన ఉంచాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి?
-ముఖ్యమంత్రి:రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించజాలదు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలకు బాలారిష్టాలు తప్పవు. అటువంటి ప్రయత్నాలు చేస్తే దేశంలో ఉన్న 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కౌన్సిల్ ఏర్పాటు చేస్తాం. ఇందులో బీజేపీ ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానిస్తాం. యుద్ధం ప్రకటిస్తాం. అందులో కూడా విజయవంతమవుతాం. అనుమానం లేదు. కోట్ల మంది ప్రజలు నా వెనుక ఉన్నారు. సోయి పెరిగి రాజకీయ శక్తుల పునరేకీకరణ జరుగుతున్నది. ఇది అపూర్వమైన దృశ్యం.
కల్లూరి శ్రీనివాసరెడ్డి, సీనియర్ జర్నలిస్టు
హామీలు నెరవేర్చడానికి సంవత్సరాలు పడుతుందని భావిస్తే కేవలం 46 రోజుల్లోనే వరాలు కురిపించారు. 60 ఏండ్లుగా రాజకీయ స్వాతంత్యం కోసం పోరాడిన తెలంగాణవాదులు సీఎంగా కేసీఆర్‌ను చూడగలుగుతున్నారు. ఇంటి పార్టీ గెలిచింది. ఒక రైతు బిడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం సంతోషకరం. ఆటోరిక్షావాలాలు, డాక్టర్లు, ఉద్యోగులు అన్ని వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మిత్రుల ఒత్తిడి మేరకే ఎన్నికల్లో పాల్గొన్నా..
హైదరాబాద్, జూలై 17(టీమీడియా): తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. 40 ఏండ్లపాటు రాజకీయాల్లో రాపిడిని అనుభవించానని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో వేయిజన్మలకు కావాల్సిన కీర్తిని గడించానని, ఇక చరిత్రగా మిగిలిపోవాలని ఆకాంక్షించానని ఆయన తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో టీ చానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు.
ఉద్యమంలో పాల్గొన్న మిత్రులందరూ సాధించిన తెలంగాణను ఎవరి చేతుల్లో పెడితే ఏమవుతుందోనన్న ఆందోళన వ్యక్తం చేశారని సీఎం కేసీఆర్ తెలిపారు. దేశపతి శ్రీనివాస్ వంటి మిత్రుల ఒత్తిడి మేరకు ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొన్నానని వివరించారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించారని, ప్రజల మద్దతు లభించిందని, అందుకే అంతరాలు లేని, ఆదర్శవంతమైన బంగారు తెలంగాణను నిర్మించడం బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..