తెలంగాణ ప్రకటన రాగానే అన్ని రకాల సమస్యలు ముందుకు తెస్తున్నారు సీమాంధ్ర నాయకులు.అందులో భాగంగా సినిమా పరిశ్రమ గురించి కూడా అనేక రకాల వాదనలు వినిపిస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ విడిపోయినా సినిమా రంగం ఒక్కటిగానే ఉంటుందని ఒకరు, కాదు కాదు సినిమా రంగం రెండు కావాల్సిందేనని మరొకరు అంటున్నారు. కానీ ఈ రోజున్న సినిమా పరిశ్రమ మొత్తానికి మొత్తం సీమాంధ్ర వాళ్ళదేనని చెప్పకతప్పదు.
ఈ సినిమా రంగం ఏనాడూ తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని వ్యక్తీకరించలేదు. కాపాడే ప్రయత్నం చేయలేదు. అంతేకాదు ఇన్నేళ్ల సినీరంగ చరిత్రలో 80వ దశకంలో బి.నరసింగరావు తీసిన ‘మా భూమి’ తప్ప మరొక సినిమా ఈ ప్రాంతం వారసత్వాన్ని నిలబెట్టుకోలేకపోయింది,అనే దానికంటే రాకుండా అడ్డుకున్నారు అనడం సమంజసం. ఇప్పుడున్న తెలుగు సినిమా(ఆంధ్రా సినిమా) తెలంగాణ సినిమా కానేకాదు. తెలంగాణ ప్రజల మనోభావాలు వీరికి అవసరం లేదు. ఇక్కడ ఉన్నచారిత్రాత్మక వాస్తవిక గాథలు వీరికి ఏనాడూ కథా వస్తువుగా చూడలేదు, సినిమాలుగా నిర్మించలేదు. తెలంగాణ ప్రాంత మాతృభాషలో పరిపూర్ణంగా ఒక్క సినిమా కూడా నిర్మించలేదు. అందుకే ఇప్పుడున్న సినిమారంగం తెలంగాణ సినిమా కానేకాదు. కాబట్టి తెలంగాణ ప్రాంత సినిమా కోసం మనం ఈ రోజు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది.
భారతదేశ సినిమా వంద వసంతాల్లోకి వచ్చింది. అలాగే ఆంధ్రా సినిమా 80వ సంవత్సరంలోకి వచ్చింది. కాని తెలంగాణ సినిమా 2014 నుంచి ఉనికిలోకి వచ్చి తన సత్తాను చాటుకోబోతుంది. ఇప్పటికైనా తెలంగాణ సినిమాను దక్కన్ పీఠభూమిలో నిర్మించుకోవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. దానికి ఈ ప్రాంత కళాకారులు, మేధావులు చిత్రరంగ నిపుణుల సహాయ సహకారాలు ఎంతో అవసరం. నవ తెలంగాణలో తెలంగాణ సినిమాను నిర్మించుకొని ఇక్కడి మట్టి వాసనల పరిమళాలను సినీరంగానికి అద్దేలా చూడాల్సిన బాధ్యత ఉన్నది. ఆంధ్రవూపదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, డైరెక్టర్ల సంఘం, నిర్మాతల సంఘం ఏనాడూ తెలంగాణ ప్రాంత కార్మికుల కోసం చేసిందేమీలేదు. అన్ని రంగాలలో ఉన్న వివక్షనే ఈ సినీ రంగంలో అన్నింటికంటే ఎక్కువగా కనిపిస్తుంది. తెలంగాణలో ఉన్న భూములను కబ్జాపెట్టి,తక్కువ ధరలకు కొనుక్కొని తెలంగాణ ప్రాంత కళాకారులను ఎదగకుండా చేసిన ఘనత ఈ ఆంధ్రా ప్రాంత హీరోలకు, నిర్మాతలకే చెల్లుతుంది.
ఆంధ్రా ప్రాంత సినీ వ్యాపారస్తులు వారికి ఉన్న పలుకుబడితో రేపు ఏర్పడే రెండు ప్రాంతాల ప్రభుత్వాలలో తమకు కావాల్సిన విధంగా, అనుకూలంగా మార్చుకునే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి తెలంగాణ ప్రాంత నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 1941లో ఏర్పడిన హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఆంధ్రా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో అంతర్భాగంగానే పనిచేస్తుంది. కాని ఏనాడు ఒక స్వతంత్ర ఛాంబర్‌లాగా పనిచేయలేదు. ఇప్పుడు ఈ ఛాంబర్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌గా మారింది. అదేవిధంగా తన స్వతంత్రత నిలుపుకునే విధంగా పనిచేయాలని, రేపు రానున్న తెలంగాణలో నిర్మించే సినిమాలను ఈ ఛాంబర్ ముందుండి నడిపించాలని ఈ ప్రాంత డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబ్యూటర్లను, థియేటర్ యజమానులను తెలంగాణ ప్రాంత కళాకారులు, సినీరంగ నిపుణులు కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రాం తంలో సినిమా నిర్మాణానికి ప్రతి ఒక్కరు చేయూతనిచ్చి తెలంగాణ సినిమాను తలెత్తుకొని నిలిచేలా నిలుపుతారని ఈ ప్రాంత కళాకారులు ఆశిస్తున్నారు. తెలంగాణ ప్రాంత నిర్మాతలు కూడా ఆంధ్రా ప్రాంత హీరోలతోనే సినిమాలు తీయాల్సిన గత్యంతరం ఈ ఆంధ్రా సినిమా రంగంలో ఉంది. వారి నుంచి తెలంగాణ ప్రాంత సినిమాను విముక్తి చేసుకొని నవ తెలంగాణలో ‘తెలంగాణ సినిమా’ నిర్మించుకోవాలి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ రాగానే ఇక్కడి లాభాలతో అక్కడ సమైక్యాంధ్ర భావజాలంతో ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఆంధ్రా సినిమాకు చెందిన ప్రముఖులు ఉన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలని ఆంధ్రా సినిమాకు సంబంధించిన వారు మెలికపెడుతున్నారు. అంటే నైజాం ఏరియా కలెక్షన్లతో కోట్లకు పడగలెత్తిన ఆంధ్రా సినిమా అగ్రహీరోలు కనీసం ఈ ప్రాంత అభిమానుల కోరికలకు అనుగుణంగా మాట్లాడటం లేదు. అంతేకాకుండా ఆంధ్రా ప్రాంతం లో తమ సినిమాలను స్వచ్ఛందంగా బంద్ చేసుకుని తెలంగాణ ప్రాంతంలో సినిమాలు ఆడే విధంగా ఒత్తిడి తెస్తున్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్నప్పుడు సకల జనుల సమ్మె కాలంలో అగ్రహీరోల సినిమాలు విడుదల చేసి దండుకున్నారు. అదే ఇప్పుడు ఆంధ్రా ప్రాంతంలో నిరసనలు వెల్లు తరుణంలో తేదీలను ప్రకటించిన పెద్ద పెద్ద నిర్మాతలు, పెద్ద హీరోల సినిమాలను కావాలని విడుదల కాకుండా చూసుకుంటున్నారు. అంతే కాదు భారతీయ వందేళ్ళ చలన చిత్రోత్సవాలలో కూడా వీరు పాల్గొనడం లేదు. అందుకే తెలంగాణ ప్రాంత సినీ కళాకారులు, ఉద్యమకారులు, మేధావులు, కవులు ముక్తకంటంతో ఈ సినిమా మాకొద్దు, తెలంగాణ ప్రాంతం సినిమాను మేము నిర్మించుకుంటామని చెపుతున్నారు.
తెలంగాణలో తెలంగాణ సినిమా భవిష్యత్తు ఉజ్వలంగా ప్రకాశించబోతున్నది. అంతేకాదు తెలంగాణ సినిమాలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వీరోచిత తెలంగాణ సాయుధ పోరాట గాథలను, మహత్తర తెలంగాణ తొలి, మలిదశల తెలంగాణ ఉద్యమాలను కథలుగా చేసుకొని తెలంగాణ చరిత్రను ప్రపంచానికి తెలియచేయటానికి తెలంగాణ సినిమా పరిశ్రమ పూనుకున్నది. తెలంగాణ కళాకారులారా రండి మనదైన సినిమా ప్రపంచాన్ని ‘తెలంగాణ సినిమా’ ను నిర్మించుకుందాం. మన ఆటపాటలను, తెలంగాణ మానవ సంబంధాలను, అనురాగ ఆప్యాయతలను, మన బతుకమ్మ పండుగను, సమ్మక్క- సారలమ్మల పోరాట వారసత్వాన్ని, సర్దార్ సర్వాయి పాపన్న వీరత్వాన్ని, షోయబుల్లాఖాన్ అమరత్వాన్ని, దొడ్డి కొమరయ్య పోరాటాన్ని మన సినిమాలో నిక్షిప్తం చేసి మన ముందు తరాలకు మనదైన ‘తెలంగాణ సినిమా’ ను చూపుదాం
– చే (దక్కన్ సినిమా), 9666699078.