mt_logo

కేటీఆర్ స్ఫూర్తితో పేదింటి విద్యార్థిని మెడిసిన్ చదువుకు మరో ఎన్నారై అండ

కేటీఆర్ స్ఫూర్తితో పేదింటి విద్యార్థిని మెడిసిన్ చదువుకు ఆర్థిక సాయం అందించేందుకు మరో ఎన్నారై ముందుకు వచ్చారు.  శ్రీనివాస్ పొట్టి అనే ఎన్నారై షాద్‌నగర్‌కు చెందిన భైరమోని మేఘన అనే విద్యార్థిని మెడిసిన్ ఫస్ట్ ఇయర్‌కు సంబంధించిన ఫీజును చెల్లించారు.

ఇందుకు సంబంధించిన చెక్కును నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో కేటీఆర్ చేతుల మీదుగా బైరమోని మేఘనకు అందజేశారు. షాద్‌నగర్‌కు చెందిన భైరమోని రమేష్, మంజుల దంపతులకు మేఘన సహా ముగ్గురు ఆడపిల్లలు. షాద్‌నగర్‌లోని ప్రభుత్వాస్పత్రి వద్ద చిన్న టిఫిన్ సెంటరే ఈ కుటుంబానికి ఆధారం. ఐతే చదువులో టాపర్ అయిన మేఘన ఇటీవల మెడిసిన్‌లో సీటును సాధించింది.

ఐతే ఆమె చదువుకు కావాల్సిన ఫీజు కట్టే స్థోమత కుటుంబానికి లేదు. ఈ విషయం కేటీఆర్ దృష్టికి రావటంతో మేఘన చదువుకు సాయం అందిస్తానని మాటిచ్చారు. కేటీఆర్ చేస్తున్న సాయంలో తాను కూడా భాగం అవుతానంటూ ఎన్నారై పొట్టి శ్రీనివాస్ ఫస్ట్ ఇయర్ ఫీజును కట్టేందుకు ముందుకు వచ్చారు. మంగళవారం నందినగర్‌లో ఎన్నారై తల్లితో పాటు కేటీఆర్ ఈ చెక్కును మేఘన కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా మేఘన కుటుంబ సభ్యులతో కేటీఆర్ మాట్లాడారు. డాక్టర్ చదువు పూర్తి చేసి ఉన్నత శిఖరాలకు చేరాలని మేఘనను ఆశీర్వదించారు. అదే విధంగా మేఘన ఇద్దరు సిస్టర్స్ కూడా తాము సివిల్స్‌కు ప్రిపేర్ అవతామంటూ చెప్పటంతో కేటీఆర్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పేద కుటుంబమైనప్పటికీ ముగ్గురు ఆడపిల్లలను వారికి నచ్చిన చదువు చెప్పించేందుకు కష్టపడుతోన్న మేఘన తల్లి తండ్రులు బైరమోని రమేష్, మంజుల లను కేటీఆర్ ప్రశంసించారు. పిల్లలను చదివించాలని కష్టపడే ఎంతో మంది తల్లితండ్రులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని వారిని అభినందించారు.

అదే విధంగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన సిక ప్రశాంత్ అనే ఓ యువకుడు చిన్న వయసులోనే మృతి చెందాడు. మూడేళ్ల పాప ఉన్న ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఎక్స్ (ట్విట్టర్) ద్వారా విషయం తెలుసుకున్న కేటీఆర్ ఆ కుటుంబానికి అండగా నిలుస్తానని మాట ఇచ్చారు. కేటీఆర్ స్ఫూర్తితో తన వంతుగా ప్రశాంత్ కుటుంబానికి ఎన్నారై పొట్టి శ్రీనివాస్ రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించారు.

స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఆధ్వర్యంలో సిక ప్రశాంత్ భార్యకు కేటీఆర్ ఈ 50 వేల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఎన్నారై పొట్టి శ్రీనివాస్‌ను కేటీఆర్ అభినందించారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవటంలోనే అసలైన సంతృప్తి ఉంటుందని చెప్పారు. మరింత మంది ఎన్నారైలు ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు.