తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని కోట్లు దండుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఉద్యమకారులపై అసత్య ప్రచారానికి తెరతీసింది. ఈ ప్రచారాన్ని టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్ నుంచే ప్రారంభించింది. లక్షలాది రూపాయల వేతనం తీసుకునే కోదండరామ్ విద్యార్థులకు పాఠాలు చెప్తున్నాడా? అని ఆ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు ఇటీవల ప్రశ్నించారు. అంతటితో ఆగలేదు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని కోట్లు సంపాదిస్తున్నారని అసత్య ఆరోపణలు గుప్పించాడు. విద్యార్థి దశ నుంచే అభ్యుదయ భావాలు పుణికిపుచ్చుకున్న కోదండరామ్‌పై ఇష్టం వచ్చినట్లుగా నోరుపారేసుకున్నాడు. తెలంగాణ ఉద్యమంపై టీడీపీకి ఉన్న అక్కసునంతా మోత్కుపల్లి వెల్లగక్కాడు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను వ్యక్తపరుస్తున్నాడనే కోపంతోనే మోత్కుపల్లి ఇలా మాట్లాడరని అర్థమవుతుంది.
సీమాంధ్ర పెట్టుబడిదారి శక్తుల్లో బందీలుగా ఉండి వారి పాపాల్లో భాగస్వాములైన మోత్కుపల్లి లాంటి ఎందరో కోదండరామ్‌పై ఎన్నోమార్లు నోరుపారేసుకున్నారు. కానీ ఆయన ఎప్పటిలా నిర్మలచిత్తంతోనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాడు. ఆయన ముందున్న లక్ష్యమొక్కటే నాలుగున్నర కోట్ల ప్రజల నాలుగు దశాబ్దాల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర సాధనే. కోదండరామ్ తెలంగాణ ఉద్యమంతోనే వెలుగులోకి వచ్చిన వ్యక్తి కాదు. ఆంధ్రప్రదేశ్‌కే తలమానికమైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా కొన్ని వేల మంది రాజనీతిజ్ఞులను తయారు చేశాడు. ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులెందరో చట్టసభల్లో సభ్యులుగా ఉన్నారు. అనునిత్యం ఉద్యమాల్లో పాల్గొనే కోదండరామ్ ప్రభుత్వం ఇచ్చే వేతనంలో సగం పేద విద్యార్థుల సంక్షేమానికే ఖర్చు చేస్తున్నారు. ఎంతో మంది విద్యార్థులకు ఆయనే సర్వస్వం అయి చదువుకునేందుకు తోడ్పాటునిచ్చారు. కోదండరామ్ ఉద్యమంలో కోట్లాడి రూపాయలు సంపాదించే స్వభావమున్నవాడే అయితే మోత్కుపల్లిలాంటి ఎందరిలాగో ఆయన దర్జాగా ఏదో పదవిలో కూర్చునేవారు. కానీ ఆయన ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు అవిశ్రాంతంగా ఉద్యమ బాటనే సాగుతున్నారు. ఆ రోజు నుంచే ఆయన పేద విద్యార్థుల పక్షాన నిలుస్తున్నారు. ఈ విషయంలో ఉస్మానియాలో చదువుతున్న విద్యార్థులెందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తిని టార్గెట్ చేసి టీడీపీ కుట్ర రాజకీయాలకు తెరతీసింది. తెలంగాణ ప్రజలు తమ పార్టీకి దూరమవుతున్నారనే అక్కస్సుతోనే ఉద్యమ నాయకుడిపై అక్కసు వెళ్లగక్కింది.
టీడీపీ ప్రజాధరణ తగ్గడానికి టీ జేఏసీయే కారణమనేది టీడీపీ ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ తీరు సూర్యుడిపైనే ఉమ్మేసినట్టుగా ఉంది. అవతలి వారిపై అనవసరంగా బురద చల్లాలని చూస్తే ఆ బురదలోనే కూరుకుపోవాల్సి వస్తుందనే విషయాన్ని విస్మరిస్తోంది. తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారు. వారు తీర్పునిచ్చే రోజూ దగ్గర పడుతోంది. ఆ రోజు కచ్చితంగా ఇలాంటి వారికి గుణపాఠం చెప్పితీరుతారు.