టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే విషయాన్ని తట్టుకోలేక టీడీపీ, కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, టీఆర్ఎస్ లో చీలిక వస్తుందని కలలు కంటున్నారని టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ క్యాడర్ ను అయోమయానికి గురిచేయడానికే తమపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని, అదుపుతప్పి మాట్లాడితే తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యులని హరీష్ రావు టీడీపీ నేతలను హెచ్చరించారు.
పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లు వెన్నుపోటు పార్టీ అయిన టీడీపీకి వేరే పార్టీల నేతలు కూడా వెన్నుపోటుదారులుగానే కనిపిస్తున్నారని, అందరూ చంద్రబాబులా ఉండరని, అధికారంకోసం నానా గడ్డి కరిచే రకం తాము కాదని, పదవుల కోసం తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవాళ్ళం కాదని ఆయన స్పష్టం చేశారు. విలువలతో కూడిన రాజకీయం మాత్రమే టీఆర్ఎస్ పార్టీ చేస్తుందని, కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమించినట్లుగానే తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా ఆయన నాయకత్వంలోనే పాల్గొంటామని హరీష్ రావు పేర్కొన్నారు.
అడ్డదారులు తొక్కి కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని, కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం పక్కా అని, మే 16తర్వాత పొన్నాల, ఇంకా ఇతర కాంగ్రెస్ ముఖ్యనేతలంతా ఇళ్లకే పరిమితమవుతారని, పొన్నాల ఒక ఫెయిల్యూర్ పీసీసీ అధ్యక్షుడని అన్నారు.