mt_logo

నా చేతిలో ఏమీ లేదు – పీకే మహంతి

శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతితో జరిగిన ఉద్యోగసంఘాల నేతల భేటీ తీవ్ర నిరాశను మిగిల్చింది.దాదాపు గంటపాటు ఉద్యోగుల వాదనలు విన్న ఆయన వారికి ఏరకమైన ఓదార్పు ఇవ్వలేకపోయారు. నెలల తరబడి ఎన్నో వినతిపత్రాలు సమర్పించిన ఉద్యోగులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి ఎలాంటి భరోసా లభించలేదు. నేను నిమిత్తమాత్రుడిని. నా చేతిలో ఏమీ లేదు. నేను కేంద్రానికి బద్ధుడిని అని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో చెప్పారు. ముందు మీరు ఎక్కడికి పంపిస్తే అక్కడ చేరండి అని, తర్వాత అన్నీ సర్దుకుంటాయి అని ఉచిత సలహా కూడా ఇచ్చారు. ప్రస్తుతం జరుపుతున్న కేటాయింపులన్నీ తాత్కాలికమేనని, రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక కొత్త ముఖ్యమంత్రులు సమస్యను పరిష్కరిస్తారని మహంతి స్పష్టం చేశారు.

ఏ ఉద్యోగిని ఏ రాష్ట్రానికి కేటాయించిందీ జూన్ 1 వ తేదీ రాత్రి ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉంచుతామని, అందులో ఉన్న ఆదేశాల మేరకు జూన్ రెండు నుండి కేంద్ర నిబంధనల ప్రకారం తమ విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని మహంతి ఉద్యోగులకు సూచించారు. గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఉద్యోగుల అభ్యంతరాలను జూన్ 9 వరకు స్వీకరించనున్నట్లు, ఈ లోపు ఏ రాష్ట్రానికి చెందిన ఫైళ్ళు ఆ రాష్ట్రానికి పంపిణీ చేయడం, ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. జూన్ 15న మరోసారి సమావేశమై ఉద్యోగుల అభ్యంతరాలను బట్టి మరో ప్రొవిజనల్ లిస్టు విడుదల చేస్తామని, ఉద్యోగుల పంపిణీ చివరిదశకు చేరుకునేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, నాలుగు దశల్లో ఉద్యోగుల విభజన ఉంటుందని మహంతి తెలిపారు.

సమావేశం అనంతరం ఉద్యోగసంఘాల నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణ వాదులను సీమాంధ్రకు కేటాయించినా తెలంగాణకు రప్పిస్తామని తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. కేంద్రానిది యుద్ధనీతి అని, కావాలనే సీమాంధ్ర ఉద్యోగులను రక్షించుకోవదానికే తెలంగాణ ఉద్యోగులను బందీలుగా సీమాంధ్రకు బదిలీ చేస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీ విఠల్ మండిపడ్డారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆంద్ర ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేయడానికి మానసికంగా సిద్ధం కావాలని, ఇప్పుడే వెళ్తే సీనియారిటీ, ప్రమోషన్లలో ఎలాంటి గొడవలు ఉండవని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *