రైతులకు లక్షలోపు పంట రుణమాఫీపై సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. రుణమాఫీ మొత్తాలను విడతల వారీగా బ్యాంకులకు చెల్లిస్తామని, మాఫీకి సంబంధించి విధివిధానాల ఖరారుకు ఉపసంఘం కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నూటికి నూరుశాతం రైతు రుణమాఫీ అమలు చేస్తామని, తమది ప్రజాస్వామ్య ప్రభుత్వమని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ముందుకు పోతాం తప్ప వెనుకడుగేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
మంగళవారం సచివాలయంలో బ్యాంకర్లతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించి రుణమాఫీపై ప్రభుత్వ ప్రతిపాదనలు వారికి వివరించారు. రుణమాఫీకి సంబంధించిన మొత్తాన్ని విడతలవారీగా చెల్లిస్తామని, ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంటుందని, రైతులకు తక్షణమే కొత్త రుణాలు ఇవ్వాలని బ్యాంకు అధికారులను కోరారు. అంతేకాకుండా రుణమాఫీని ఏ పద్ధతిన అమలు చేయాలనే విషయంపై స్పష్టత కోసం బుధవారం మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఉపసంఘం సమావేశం నిర్వహించి వీలైనంత త్వరగా కమిటీ విధివిధానాలు రూపొందించి నివేదిక అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
రైతులకు రుణమాఫీ చేసే విషయంలో బ్యాంకర్లు అనేక షరతులు విధిస్తున్నారని, ఈ విషయమై తాను ఆర్ బీఐ గవర్నర్ రఘునాథ్ రామన్ తో చర్చలు కూడా జరిపానని, మాఫీకి సంబంధించి ప్రభుత్వం వద్ద ముఖ్యంగా రెండు ప్రతిపాదనలున్నాయని, రైతులకు బాండ్లు ఇచ్చే అంశాన్ని కూడా తాము పరిశీలిస్తున్నామని సీఎం వివరించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి టీ రాజయ్య, ఆర్ధిక శాఖామంత్రి ఈటెల రాజేందర్, భారీ నీటిపారుదల శాఖామంత్రి టీ హరీష్ రావు, ఎంపీ కేకే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, పలు బ్యాకులకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.