నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన పలువురు కాగ్రెస్, టీడీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు సోమవారం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఇక్కడున్న ఆంధ్రా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఆంధ్రోళ్ళకు మనమెందుకు ఫీజు కట్టాలి? తెలంగాణ సొమ్ము తెలంగాణ బిడ్డలే తినాలి. వాళ్లకు ఇస్తే ఇక్కడి పిల్లలకు న్యాయం జరుగుతుందా? మన దగ్గర గరీబోళ్ళు లేరా? మనం ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే పైసలు కాపాడుకోవాలి. వాళ్లకు ఫీజులు కట్టాలంటే 200కోట్లు అవుతాయి. ఈ డబ్బును జుక్కల్ నియోజకవర్గానికి నీళ్ళు తెచ్చేందుకు ఖర్చు పెడితే మొత్తం పచ్చబడుతది’. అని స్పష్టం చేశారు.
తెలంగాణ పేదరికం పోవాలనేది కేసీఆర్ తాపత్రయమని, మావోళ్ళకే ఫీజులు కడతామని కేసీఆర్ అంటే ఆయన మీద తప్పు తీస్తున్నారని హరీష్ మండిపడ్డారు. కేసీఆర్ ను నమ్మిన వారంతా ఇతర పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని, తెలంగాణ వచ్చిన తరువాతైనా టీడీపీ మారుతుందనుకుంటే చంద్రబాబు తెలంగాణ ప్రజలపై ఇంకా కోపం పెంచుకుంటున్నారని, పీపీఏ రద్దు, పోలవరం లాంటి అంశాలతో తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నారని చెప్పారు.
తెలంగాణలో టీడీపీ రోజురోజుకూ ఖాళీ అవుతుందని, బాబు తీరు నచ్చకే టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో చేరారని, ప్రజలంతా కేసీఆర్ ను నమ్ముతున్నారని అన్నారు. కేసీఆర్ మాట మీద నిలబడే వ్యక్తి అని, మాట ప్రకారం 18వేల కోట్ల రుణమాఫీ చేయబోతున్నారని, తెలంగాణలో రాబోయే రెండేళ్లలో రైతులకు తొమ్మిది గంటలపాటు విద్యుత్ ఇచ్చే ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. మానిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే హన్మంత్ షిండే, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.