తెలంగాణ ప్రజలకు దేశం గర్వించదగ్గ సుపరిపాలన అందిద్దామని, ప్రభుత్వ పథకాల విషయంలో పారదర్శకంగా, వేగవంతంగా అమలు జరిగేలా ఎల్లవేళలా అప్రమత్తతతో పనిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన మంత్రివర్గాన్ని ఆదేశించారు. ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల మంత్రులతో దాదాపు రెండుగంటలపాటు సమావేశమైన కేసీఆర్ కృష్ణా జలాల పంపిణీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ధోరణి, విద్యుత్ ఒప్పందాలు, త్వరలో జరగనున్న జెడ్పీ చైర్మన్ ఎన్నికలపై చర్చించారు.
తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా వివాదాలు సృష్టిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ తెలంగాణకు ఏమాత్రం నష్టం రాకుండా చూడాలని మంత్రులకు సూచించారు. సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన తప్పులను పునఃపరిశీలించి తెలంగాణకు జరిగిన అన్యాయాలను సరిదిద్దేందుకు మంత్రులు కృషి చేయాలని సీఎం కోరారు. నదీ జలాలల పంపిణీపై ఏపీ వాదనలు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును ఆదేశించారు.
మంత్రుల పేషీల్లో ఎలాంటి అవినీతి జరగకుండా అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేసేలా చూడాల్సిన బాధ్యత మంత్రులదేనని అన్నారు. ప్రజా పథకాల అమలులో పూచికపుల్లంత అవినీతికి కూడా ఆస్కారం ఉండొద్దని మంత్రులను ఆదేశించినట్లు తెలిసింది. జిల్లా పరిషత్, మండల పరిషత్, నగర పాలక మేయర్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకునేందుకు కృషి చేయాలని, హంగ్ ఏర్పడిన జిల్లాల్లో చైర్మన్ పోస్టులను దక్కించుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేయాలని కూడా సీఎం సూచించారు.