టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ఈరోజు లోక్ సభలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం అద్భుతమైనదని, తమ పార్టీ మళ్ళీ విజయం సాధించడంలో రైతుబంధు స్కీం ముఖ్యపాత్ర పోషించిందని అన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కన్నా ఎక్కువగా రైతుబంధు పథకం కింద రైతులకు పంట సాయం చేస్తున్నామని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికలు రెండు పాఠాలు నేర్పాయన్నారు. రైతులను విస్మరించరాదని, రైతు రుణాలను మాఫీ చేయాలన్నది కూడా అత్యవసరమని జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని, ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని ఎంపీ జితేందర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. డబ్లింగ్, బ్రిడ్జ్ నిర్మాణం కోసం దక్షిణ మధ్య రైల్వేకు నిధులు కేటాయించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వరంగల్ లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉందని, ఈ వర్సిటీ కోసం కేటాయింపులను తగ్గించారని అన్నారు. తెలంగాణలో మరిన్ని ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని, తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని స్వయానా ప్రధాని మోడీనే ఈ మాట అన్నారని ఎంపీ గుర్తు చేశారు.